ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే లాస్ లో 20శాతం వరకు నిర్మాత తిరిగి వెనక్కు బయ్యర్లకు ఇవ్వాలన్నది నిర్మాతల చాంబర్ రూల్. ఇప్పుడు ఈ రూల్ భలే పనికి వచ్చింది ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాత అయిన బాలయ్య బాబుకు. ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లకు పైగా విలవకు విక్రయించారు. ఒక్క నైజాం ఏరియాను మాత్రం రిటర్న్ బుల్ అడ్వాన్స్ మీద ఇచ్చారు. అందువల్ల అది లెక్క వేయడానికి లేదు.
సినిమా బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేసింది. బయ్యర్లకు 80 శాతం వరకు నష్టాలు తప్పలేదు. తొలిభాగం వల్ల నిర్మాత బాలయ్యకు 50 కోట్లు రైట్స్ ద్వారా, 4 కోట్లు నైజాం ద్వారా వచ్చాయి. అది కాక డిజిటల్ శాటిలైట్ ద్వారా భారీ మొత్తాలు వచ్చాయి. ఎన్టీఆర్ బయోపిక్ కు క్రిష్ డైరక్టర్ గా వచ్చి చేసిన మాయాజాలం ఫలితం ఇది.
ఎప్పటి కప్పుడు రకరకాల లుక్ లు విడుదల చేస్తూ, క్రమంగా సినిమాకు బజ్ పెంచారు. ఇదంతా క్రిష్ చలవే. దాంతో సినిమా నిర్మాణ వ్యయానికి దాదాపు సమానమైన మొత్తం లాభంగా సమకూరింది. అందుకే బయ్యర్లందరికీ అవసరం అయితే రెండో భాగం డిస్ట్రిబ్యూషన్ కు ఇస్తామని, తొలిభాగంలో రికవరీ అయిపోతే 10శాతం, లేదంటే 20శాతం కమిషన్ ఇస్తామని బయోపిక్ నిర్మాణ నిర్వాహకులు బయ్యర్లకు భరోసా ఇచ్చారు.
దీంతో బాలయ్య సినిమాలతో పోల్చుకుంటే ఎక్కువకు కొన్నా, రెండు భాగాలు కలిపి అనే భ్రమతో బయ్యర్లు ధీమాగా వున్నారు. కానీ ఇప్పుడు అదే దెబ్బ కొట్టింది. సినిమా ఫ్లాప్ తరువాత కూడా రెండో భాగం తమకు ఇచ్చేస్తారు అనే ధీమాగా వున్నారు. కానీ ఇప్పుడేమయింది. తొలిభాగం నష్టంలో 20శాతానికి బదులు 25శాతం తమ వంతుగా ఇచ్చేస్తూ, రెండో భాగాన్ని కొత్తగా డిస్ట్రిబ్యూషన్ కు ఇస్తూ అగ్రిమెంట్లు రెడీ చేసినట్లు బోగట్టా. అంటే తొలిభాగంలో వచ్చిన యాభై కోట్లలో మహా అయితే పది నుంచి కోట్లు వెనక్కు పోతాయి.
దానికి బదులు బాలయ్య దగ్గర రెండో భాగం శాలిడ్ గా వుండిపోతుంది. ఎంత కాదన్నా తొలిభాగం ఇరవై కోట్ల వరకు వసూళ్లు చేసింది. మలిభాగం కూడా అలాగే చేస్తుంది అనుకున్నా, వెనక్కు ఇచ్చే పది పోయినా పది లాభం. అంటే మొత్తం మీద చూసుకంటే ఓన్లీ థియేటర్ మీద 60 కోట్లు వచ్చినట్లు అవుతుంది రెండు భాగాలపై. దీనికి శాటిలైట్, డిజిటల్ అదనం.
అదృష్టం బాగుండి రెండో భాగం హిట్ అయితే మరింత ఆదాయం. ఎవరూ వేలు ఎత్తి చూపడానికి కూడా లేదు. ఎందుకంటే చాంబర్ రూల్ ను నికార్సుగా పాటించారు కదా? కానీ ఒక్కటే. కొనుక్కున్న వారంతా బాలయ్యకు అత్యంత సన్నిహితులే. సాయి కొర్రపాటి, అనిల్ సుంకర, క్రిష్, 14 రీల్స్ ఇలా. మరి వారికే బాలయ్య ఇలా చేయడం అంటే….?