జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీ నేతలకు టార్గెట్ గా మారారు. ఆయన ఇటీవలి కాలలో రాజకీయాలకు సంబంధం లేదు ..తటస్థం అన్నట్లుగా ఉండాలని అనుకుంటున్నారు. కానీ అది రాంగ్ వేలో వెళ్తున్నారు. ఆయన అమిత్ షాను కలిసిన తర్వాత పరిస్థితి మరింత మారిపోయింది. ఎన్టీఆర్ కుటుంబాన్ని ఆయనకు సన్నిహితులుగా పేరు పడిన వారు అత్యంత దారుణంగా తిడుతున్నా స్పందించలేదు. ఇప్పుడు ఎన్టీఆర్‌కు అవమానం జరిగినా ఆయన స్పందించిన తీరు చూసి .. టీడీపీ.. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇదేం తీరు అనుకోకుండా ఉండలేకపోతున్నారు.
రాజకీయాలకు దూరంగా ఉండటమంటే టీడీపీకి దూరంగా ఉండటం కాదు !
జూనియర్ ఎన్టీఆర్ గతంలో టీడీపీకి ప్రచారం చేశారు. తర్వాత కెరీర్ పై దృష్టి పెట్టారు. ఈ లోపు ఆయనకు కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరిగింది. అది నిజమో కాదో వారికే తెలియాలి. ఆయన మాత్రం రాజకీయాలుక దూరంగా ఉన్నానని తటస్థంగా ఉండేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. కానీ ఎలా చూసినా ఎన్టీఆర్‌పై టీడీపీ ముద్ర ఖచ్చితంగా ఉంటుంది. అది చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. దాన్ని తప్పించుకోవాలంటే ఆయనపై ఇతర పార్టీల ముద్ర పడుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆ ముద్ర వల్ల ఎన్టీఆర్ ఎంత నష్టపోతారో ముందు ముందు తెలుస్తుంది.
కల్యాణ్ రామ్‌కు ఉన్నంత లౌక్యం కూడా లేదా !?
ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ ఒకటేనన్న వాదన జూనియర్ వినిపించారు. ఆ మహానుభావుడితో వైఎస్ఆర్ను ఎలా పోలుస్తారని టీడీపీతో పాటు సొంత సామాజికవర్గంలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అదే సమయంలో కల్యాణ్ రామ్ కూడా స్పందించారు. ఆయన స్పందన టీడీపీ నేతలకు నచ్చింది. వైఎస్ఆర్ ప్రస్తావన లేకుండా.. ఏపీ ప్రభుత్వ చర్యను తప్పు పడుతూ ట్వీట్ చేశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ లౌక్యం చూపించలేకపోయారు. ఓ వైపు ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా విమర్శించినా ఎన్టీఆర్ సరైన రీతిలో స్పందించలేదన్న అసంతృప్తి ఆ పార్టీ అభిమానుల్లో ఇప్పటికే ఉంది. ఇప్పుడు మూల పురుషుడైన తాత ఎన్టీఆర్‌ను అవమానిస్తున్నా.. సరైన రీతిలో స్పందించలేదన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వచ్చేశారు.
టీడీపీకి దూరం.. ఇతర పార్టీలకు ఆత్మీయుడు !
జూనియర్ ఎన్టీఆర్ స్పందన టీడీపీ అభిమానులకు అసలు నచ్చకపోగా ఇతర పార్టీల వారికి మాత్రం ఎంతో బాగా నచ్చింది. మామూలుగా అయితే ఆయన స్పందన టీడీపీ వాళ్లకు నచ్చాలి. కానీ అక్కడే తేడా వచ్చింది. గొప్పగా స్పందించారంటూ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ట్విట్ పెట్టేశారు. ఇటీవల అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసిన సందర్భంగా విష్ణువర్దన్ రెడ్డి మరింత అడ్వాంటేజ్ తీసుకుని ఆయన బీజేపీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నట్లుగా ప్రకటనలు చేశారు. ఇక వైసీపీ నేతల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్‌తో సమానంగా వైఎస్ఆర్ అనే సర్టిఫికెట్ .. జూనియరే ఇచ్చేశాడని రెచ్చిపోతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయ ఆలోచనలు ఇప్పుడు ఉండకపోవచ్చు. అసలు రానని అనుకోవచ్చు. కానీ ఆయనపై రాజకీయ ముద్ర మాత్రం ఉంటుంది. టీడీపీని కాదనుకుంటే ఆయనపై ఇతర పార్టీల ముద్రపడుతుంది కానీ తటస్థంగా ఉంటారని ఎవరూ అనుకోరు. ఇది ఎన్టీఆర్‌కు అంత మంచిది కాదు.