వైసీపీ అధినేత జగన్ ప్రశాంతంగా లండన్ పోయారు. కానీ ఆయన చెప్పినట్లుగా చేసిన..చేస్తున్న వారు అయితే పరారీలో ఉన్నారు లేకపోతే ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డున పడాల్సి వస్తోంది. జగన్ పార్టీ నేతలు చాలా మంది పరారయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికే పిన్నెల్లి సోదరులు అడ్రస్ లేరు. వారిని రేపోమాపో అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంక
నమ్ముకున్న అధికారులు ముందే ఉద్యోగాలు పోగొట్టుకుని జైలు పాలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పోలింగ్ సరళి అనుకూలంగా లేదని రాష్ట్రం మొత్తం అల్లర్లు రేపాలని చేసిన ప్రయత్నాలు సంచలనంగా మారాయి. మూడు రోజుల పాటు ఆగకపోవడంతో పోలీసుల నిర్లిప్త వైఖరి తేటతెల్లమయింది. ఈసీ కొరడా ఝుళిపించడంతో అస్మదీయ అధికారులు రోడ్డున పడ్డారు. పోలింగ్ అరాచకాల కోసం ఓ ప్రణాళికబద్దంగా కుట్ర జరిగినట్లు తేలడంతో విచారణకు ఈసీ ఆదేశించింది.
ప్రస్తుత పరిస్థితి చూస్తే పోలీసులు పెద్ద ఎత్తున బలి కావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం మారితే వారి ఉద్యోగాలు పోవడమే కాదు..జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఇక వైసీపీ నేతలు పరారీలో ఉంటున్నారు. పిన్నెల్లి సోదరులు పరారయ్యారు. ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏమిటా అని భయపడేవారు చాలా మంది ఉన్నారు. వారంతా సైలెంట్ అయిపోయారు. ఇన్నాళ్లూ బాగానే ఉంది కానీ.. రేపు ఏమైనా అయితే పట్టించుకునేవారు ఉండరని ఆవేదన చెందుతున్నారు.