కోళ్లకు కత్తిని కట్టి ఆడే పందేలతో కోళ్లకే కాదు.. మనుషులకూ ప్రమాదమే. సంక్రాంతి సందర్భంగా ఏపీలో నిర్వహిస్తున్న కోడి పందేల్లో కోడికత్తికి ఒకరు బలయ్యారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి పందేల దగ్గర కోడి కాలుకు కట్టిన కత్తి గుచ్చుకుని ఓ యువకుడి చనిపోయాడు. అనంతపల్లిలో కోడి పందేల పోటీలు జరుగుతున్నాయి. వీటిని తిలకించేందుకు గ్రామం నుంచే కాకుండా పొరుగున ఉన్న గ్రామస్థులు సైతం పెద్ద సంఖ్యలో అనంతపల్లికి చేరుకున్నారు.
ఎంతో ఉత్సాహంగా జరుగుతున్న పోటీల్లో ఉన్న ఓ కోడి జనం మధ్యలోకి వచ్చేసింది. దీంతో అంతా చెల్లాచెదురయ్యారు. కోడి జనం మీదకు దూకడడంతో పద్మరాజు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కోడి కాలికి కట్టే కత్తి చాలా షార్ప్ గా ఉంటుంది. తగలరాని చోట తగిలితే కత్తి తీవ్రంగా గాయపరుస్తుంది. పద్మరాజుకు లోతైన గాయం అయినట్లుగా తెలుస్తోంది. అతడిని నల్లజర్ల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రెండు రోజులుగా ఆయా జిల్లాలో కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. కార్పొరేట్ స్టైల్ లో పందేలు ఏర్పాటు చేసి.. బరుల వద్ద కోట్లలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కోడికి కత్తులు కట్టి ఆడటం నిజానికి నిషేధం. ప్రతి సంక్రాంతి సమయంలో పోలీసులు ప్రకటనలకు మాత్రమే గట్టిగా ఉంటారు. కానీ ఊరూవాడా జరుగుతూనే ఉంటాయి. సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.