అధికారం పోతేనేం.. మండలిలో ఉన్న బలంతో దున్నేయాలనుకున్నారు. కూటమి సర్కార్ తీసుకొచ్చే కీలక బిల్లులకు అడ్డు తగులుతూ రచ్చ చేయాలనుకున్నారు. కానీ.. జగన్ ఒకటి తలిస్తే దైవమొకటి తలచినట్లుగా పరిస్థితులు మారిపోయాయి. జగన్ పై విమర్శల వెల్లువ కొనసాగుతున్నా వైసీపీ ఎమ్మెల్సీలు ఒక్కరూ కిక్కురుమనడం లేదు.
గత కొద్ది రోజులుగా కూటమి నేతలు జగన్ ను వరుసగా టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడుకు వైసీపీ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. కానీ, ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ వాటిని కొట్టివేసేందుకు ముందుకు రాలేదు. ఒకే ఒక్క ఎమ్మెల్సీ మాత్రం ఆలస్యంగా మీడియా ముందుకు వచ్చారు.
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి హోంమంత్రి వంగలపూడి అనితపై ఫైర్ అయ్యారు. శాంతిభద్రతల నిర్వహణలో విఫలం అయ్యారంటూ వ్యాఖ్యానించారు. దీంతో జగన్ కామెంట్స్ ను కళ్యాణి మళ్లీ చదివి వినిపించారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ఆయితే, కూటమికి కౌంటర్ ఇచ్చేందుకు ఎమ్మెల్సీ మీడియా ముందుకు వచ్చినా.. మిగతా ఎమ్మెల్సీలు , ఎమ్మెల్యేలు గమ్మున ఉండిపోవడం చర్చనీయాంశంగా మారుతోంది.
పరిస్థితిని చూస్తుంటే ఎమ్మెల్సీలు అతి కొద్ది మినహా ఎవరూ వైసీపీలో కొనసాగేందుకు ఆసక్తిగా లేరని అందుకే జగన్ పై విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని అంటున్నారు. ఎమ్మెల్సీలను ముందుంచి రాజకీయ లబ్ది పొందాలని చూసిన జగన్ కు ఎమ్మెల్సీలు కొద్ది రోజుల్లోనే ఝలక్ ఇస్తారని రాజకీయ పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు.