జగన్ రెడ్డికి అధికారం రావడమే మైనస్ అయిపోయింది. ఆయన అందర్నీ దూరం చేసుకున్నారు. 60 శాతం కుటుంబం ఆయనకు దూరమైంది. తల్లి, చెల్లి కూడా నమ్మడం లేదు. పుట్టిన రోజు నాడు కనీసం విష్ చేయలేనంతగా వారిని దూరం చేసుకున్నారు. వివేకా హత్య నిందితుల వైపు ఉన్న కుటుంబసభ్యులు మాత్రమే .. తమను తాము కాపాడుకోవడం కోసం జగన్ రెడ్డి వైపు ఉన్నారు. రేపు అధికారం పోతే వారు కూడా జగన్ రెడ్డిని వదిలేసి తమను తాము కాపాడుకోవడం కోసం ఏదో ఓ పార్టీలో చేరిపోతారు. అందులో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు పీకే కూడా వదిలేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు యొదుగూరి సందింటి కుటుంబంలో విభేదాలు ఉన్నాయన్న వార్తే బయటకు రాలేదు. ఇప్పుడు కుటుంబసభ్యులు ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఎన్నికలకు ముందు అధికారంతో సంబంధం లేకుండా ఎంతో మంది ఆత్మీయులు జగన్ చుట్టూ ఉండేవారు. ఆయనను అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా పని చేసేవారు. వారు ఎలాంటి వారు..ఎంత మంది ఉంటారనేది.. బయట వారి కన్నా.. అక్కడ ఉండే వారికి తెలుసు . కానీ ఇప్పుడు వారిలో ఎంత మంది జగన్ ఇంటి దగ్గర ఉంటున్నారు ?. ఎవరూ లేరు. అందరూ దూరమయ్యారు.. ఒక్క సజ్జల మాత్రమే ఉన్నారు. ఆయన ఒక్కడే ఎందుకున్నారంటే.. ఆయనే రాజకీయం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి.
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మంది సివిల్ సర్వీస్ అధికారులు ఆయనతో టచ్లో ఉన్నారు. మీరు అధికారంలోకి రావాలి సర్ అని ఆయన వెంట పడిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అధికారంలోకి రాక ముందే ఆయనను పల్లకీలో ఊరేగించిన వారు ఉన్నారు. వారిలో ఇప్పుడు జగన్కు ఎంత మంది ఆత్మీయులు ఉన్నారు. ఓ పీవీ రమేష్ కావొచ్చు.. మరో రామచంద్రమూర్తి కావొచ్చు..ఎంతో మంది ఆత్మీయులు జగన్కు దూరం వెళ్లిపోయారు. వ్యతిరేకమయ్యారు. వెళ్లిపోయారు అనడం కన్నా దూరం చేసుకున్నారు అనుకోవచ్చు.
ఇప్పుడు జగన్కు ఉన్నది సజ్జల మాత్రమే. విజయసాయిరెడ్డి కూడా లేరు. సజ్జల దయాదాక్షిణ్యాల మీద ఉన్నారని వైసీపీలోఅందరికీ తెలుసు. కుటుంబం.. పార్టీ .. ఆత్మీయులు.. కార్యకర్తలు అందరూ ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. కానీ సజ్జల మాత్రమే దగ్గరవుతున్నారు. జగన్ అంటే ఇప్పుడు సజ్జల మాత్రమే కనిపిస్తున్నారు. అది కుటుంబ విషయాలైనా.. పాలనా విషయాలైనా.. మరొకటైనా.. మొత్తం చేయాల్సినదంతా చేసేసి ఈ సజ్జల కూడా సైడైపోతారేమో కానీ.. జగన్ మాత్రం ఇప్పటికే ఒంటరి అయిపోయారు. నమ్మిన వాళ్లందర్నీ నట్టేట ముంచారు.. ప్రజలతో సహా !