ఏపీలో బీఆర్ఎస్ లో చేరిన ముగ్గురు నేతల్లో ఇద్దరు అడ్రస్ లేరు. మియూపూర్ లో నలభై ఎకరాల ల్యాండ్ అడ్డం పడటంతో తోట చంద్రశేఖర్ మాత్రం ఇరుక్కుపోయారు. ఆయన హైదరాబాద్‌లో కాలక్షేపం చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి.. తెలిసిన వాళ్లకి ఇద్దరు, ముగ్గురికి కండువాలు కప్పి ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు. రావెల కిషోర్ తో పాటు చింతల పార్థసారధి అనే మరో మాజీ జనసేన నేత కనిపించడం లేదు.
ఇటీవల గుంటూరులో ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. కానీ అటు బీఆర్ఎస్ హైకమాండ్ ఎవర్నీ పట్టించుకోలేదు.. కనీసం తన ప్రతినిధిని కూడా పంపలేదు.
ఇక ఏపీలో ఉన్న రావెల కిషోర్ కూడా కార్యాలయ ప్రారంభోత్సవానికి రాలేదు. అదేదో తోట చంద్రశేఖర్ సొంత భవనంలా ప్రారంభించుకున్నారు. ఇప్పుడు ఆ భవనం బోసిపోతోంది. ఎవరూ ఉండటం లేదు. తోట చంద్రశేఖర్ కూడా హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. రావెల కిషోర్ ను జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఉపయోగించుకుంటారని చెప్పుకున్నారు. కానీ ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఇదేదో ట్రాప్ లా ఉందని రావెల కిషోర్ సైలెంట్ అయ్యారు. ఆయన టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
ఏపీలో ఓ శాఖను పేరుకు ఏర్పాటు చేశారు కానీ కేసీఆర్ ఇంత వరకూ పార్టీలో చేరిన నేతలకు ఒక్క టాస్క్ కూడా ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక్క ప్రోగ్రామ్ కూడా చేయలేదు. ప్రభుత్వంపై పోరాటం లేదా.. ప్రజా ఉద్యమం లాంటి కార్యక్రమం చేయలేదు. మధ్యలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో విజయోత్సవ సభ పెడతామని తోట చంద్రశేఖర్ చెప్పారు కానీ అది కూడా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు పూర్తిగా కేసీఆర్ ఏపీ లో పార్టీ విస్తరణ విషయంలో పెద్దగా ఆసక్తి లేనట్లుగా కనిపిస్తూండటంతో ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు లేనట్లయ్యాయి. తోట చంద్రశేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకు మియాపూర్ లో భూములు దక్కాయి. ఈ కారణంగా ఆయన బయటకు పోలేని పరిస్థితి ఉందన్న వాదన వినిపిస్తోంది.