మలి విడత బడ్జెట్ సమావేశాలు ఎందుకు సజావుగా సాగలేదో, ఎవరు సాగనివ్వలేదో అందరికీ తెలిసిందే. ఏపీ రాజకీయ పార్టీలతోపాటు, ఇతర ప్రముఖ పార్టీలు కూడా వరుసగా అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చాయి. కానీ, వాటిని చర్చకు రానీయకుండా.. సభ ఆర్డర్ లో లేదంటూ మోడీ సర్కారు తప్పించుకుంది. అది చాలదన్నట్టు… పార్లమెంటు సమావేశాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు విపక్షాల తీరే కారణమనీ, అందుకు నిరసనగా భాజపా ఎంపీలు నిరాహార దీక్షలు చేస్తారంటూ మోడీ ప్రకటించిన సంగతీ తెలిసిందే. అయితే, మోడీ వ్యూహాన్ని తిప్పి కొట్టేందుకు ఇప్పుడు విపక్షాలు కూడా ఒక మాస్టర్ ప్లాన్ తో సిద్ధమౌతున్నట్టు సమాచారం. జాతీయ మీడియా ‘రిపబ్లిక్ టీవీ’ దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన కథనం ప్రసారం చేసింది.
మోడీని ధీటుగా ఎదుర్కోవడం కోసం ఒకేసారి 100కి పైగా ఎంపీలు రాజీనామాలు చేయాలనే యోచనలో విపక్షాలు ఉన్నాయని ఆ కథనంలో పేర్కొంది. ఇలా చేయడం వల్ల మోడీ సర్కారుపై ఉన్న వ్యతిరేకత తీవ్రత బయటపడుతుందనేదనీ, ఒత్తిడి పెంచినట్టు అవుతుందనేది వ్యూహంగా తెలుస్తోంది . ఇప్పటికే, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి రావడం, శరత్ పవార్, ఫరూక్ అబ్దుల్లాతోపాటు కొందరు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరపడం కూడా ఈ దిశగా చోటు చేసుకున్న పరిణామంలో భాగమే అన్నట్టుగా ఆ కథనంలో పేర్కొన్నారు. ఇంకోపక్క, ఇప్పటికే కేసీఆర్, మమతా బెనర్జీ కూడా కోల్ కతాలో భేటీ అయ్యారు. ఎస్పీ, బీఎస్సీలు కూడా వెంట వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఇలా ఈ శక్తులన్నీ కలిసి.. వారి వారి సొంత రాజకీయ అజెండాలను కాసేపు పక్కనపెట్టి… ప్రధాని మోడీని ఎదుర్కోవడం ఒక్కటే అనే కామన్ అజెండాతో మూకుమ్మడి రాజీనామాలు చేయాలనే వ్యూహరచన జరుగుతోందని సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, పీఎన్బీ కుంభకోణం, ఎస్సీ ఎస్టీ చట్టం, కావేరీ జలాల పంపిణీ వివాదం… ఇలా అన్ని అంశాల్లోనూ భాజపా విఫలమైందనీ, మోడీ వేవ్ తగ్గిపోయిందని నిరూపించడమే ఈ మూకుమ్మడి రాజీనామాల వ్యూహం వెనక లక్ష్యం. అయితే, ఈ రాజీనామాలను స్పీకర్ వెంటనే ఆమోదిస్తారా, ముందస్తు ఎన్నికలకు మోడీ సాబ్ సిద్ధపడతారా అనేది వేరే చర్చ. మొత్తానికి, ఏపీలో టీడీపీతో, తెలంగాణలో తెరాసతోపాటు దేశంలోని ఇతర పార్టీలన్నీ మోడీ వ్యతిరేక అజెండాతో ఐక్యం కాబోయే వాతావరణం కనిపిస్తోందనేది రిపబ్లిక్ టీవీ కథనం సారాంశం. ఒకవేళ ఇదే వ్యూహం కార్యరూపం దాల్చితే.. ఇది మా వ్యూహమే,ఇప్పుడు దేశమంతా తమ వెనకే నడవాల్సి వచ్చిందని జగన్ చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.