తెలుగు360 రేటింగ్ 2.25/5
కన్ఫ్యూజ్ డ్రామాలు భలే బాగుంటాయి. దాంట్లోంచి బోలెడంత కామెడీ చేయొచ్చు. కథేమీ లేకపోయినా – ఆ గందరగోళంతోనే కథ నడిపేయొచ్చు. విజయ్ కుమార్ కొండా తీసిన `గుండె జారి గల్లంతయ్యిందే` అలాంటి కన్ఫ్యూజ్ డ్రామానే. ఫోన్ నెంబర్ మార్పిడి వల్ల జరిగే హంగామా ఆ కథ. వినోదం.. డ్రామా అన్నీ పర్ఫెక్ట్ గా పండాయి. ఇప్పుడు అదే దర్శకుడు తీసిన `ఒరేయ్ బుజ్జిగా` కూడా అలాంటి కన్ఫ్యూజ్ కథే. కాకపోతే.. పాత్రలు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది పోయి.. డైరెక్టర్ అయిపోయాడు. దాంతో గందరగోళం తప్ప మరేం కనిపించదు తెరపై. మరి ఆ డ్రామా ఏమిటి? ఈ గోలంతా ఎందుకు?
కృష్ణ వేణి (మాళవిక నాయర్)కి ఇంట్లో తనకి ఇష్టం లేని పెళ్లి కుదర్చడంతో.. పెళ్లి రోజున చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి పారిపోతుంది. సరిగ్గా అదే రోజున బుజ్జిగాడు అనే శ్రీనివాస్ (రాజ్‌తరుణ్) కూడా ఇల్లు వదిలి పారిపోతాడు. దాంతో.. వీరిద్దరూ కలిసి, కూడబలుక్కుని `లేచిపోయారు` అని పుకారు మొదలవుతుంది. నిజానికి కృష్ణవేణి ఎవరో బుజ్జిగాడికీ, బుజ్జిగాడు ఎవరో కృష్ణవేణికీ తెలీదు. రైల్లో తొలిసారి కలుసుకున్న కృష్ణవేణి, బుజ్జిగాడు.. తమని తాము స్వాతి, శ్రీనివాస్ గా పరిచయం చేసుకుంటారు. ఆ పరిచయం పెరిగి, పార్ట్నర్ షిప్ గా మారి, ప్రేమగా ముదురుతుంది. అయితే.. ఈలోగా తన కూతుర్ని లేపుకు పోయిన బుజ్జిగాడి కుటుంబం పై కక్ష పెట్టుకుంటుంది చాముండేశ్వరి (వాణీ విశ్వనాథ్). దాంతో ఎలాగైనా సరే.. కృష్ణవేణికి పట్టుకుని ఈ కన్ ఫ్యూజన్‌ని దించాలనుకుంటాడు బుజ్జిగాడు. బుజ్జిగాడ్ని పట్టుకుని తన కసి తీర్చుకోవాలనుకుంటుంది కృష్ణవేణి. అసలు కృష్ణవేణినే స్వాతి అని బుజ్జిగాడికి, శ్రీనివాసే బుజ్జిగాడని కృష్ణవేణికి ఎలా తెలిశాయి? అన్నదే మిగిలిన కథ.
నిజానికి… ఇది కాస్త తమాషా అయిన కథే. ఊర్లో ఏర్పడిన గందరగోళం, తద్వారా వచ్చే కామెడీ.. ఈ కథకు మూలం. దాన్ని సరైన దిశలో వాడుకుని, కథని నడిపిస్తే వినోదానికి కొదవ ఉండదు. అందుకు కావల్సింది మంచి సన్నివేశాలు పండడం. తొలి సీన్ లోనే.. హీరో, హీరోయిన్లు లేచిపోతారు (విడివిడిగానే). ఆ తరవాత.. ఇద్దరి మధ్య పరిచయం, అది ప్రేమగా మారడం, కృష్ణవేణినే స్వాతి అని హీరోకి తెలియడంతో ఇంట్రవెల్ పడుతుంది. ఈమధ్యన కొన్ని సన్నివేశాలు సరదాగానే సాగాయి. కాకపోతే…. విరగబడి నవ్వేఇంత కామెడీ అయితే పండలేదు. గుర్తు పెట్టుకుని మరీ మాట్లాడుకునే సీన్లూ పడేలేదు. హెబ్బా పటేల్ ని యూజ్ అండ్ త్రో పాత్ర ( ఆ క్యారెక్టర్ అలా వుంది) లానే వాడుకున్నారు. హీరోయిన్ – హీరో మధ్య ప్రేమ చిగురించడం దగ్గర్నుంచి, ప్రతీ సన్నివేశమూ… బీసీ సినిమాల నాటి ఛాయల్లో నడుస్తుంటుంది. దర్శకుడు ఇక్కడ కొత్తగా ఆలోచించాడు, కొత్తగా తీశాడు అని చెప్పుకోవడానికి ఏమీ ఉండుదు. తెరపై సన్నివేశాలు అలా అలా నడుస్తూ, మధ్యలో ఆవులిస్తూ, నిదరోతూ.. సాగుతూ ఉంటాయి.
ద్వితీయార్థం అయితే.. మరింత నీరసం వచ్చేస్తుంది. ఇలాంటి కథల్లో చెప్పడానికి ఏమీ ఉండదు. ఒకే పాయింట్ దగ్గర అటూ ఇటూ తిప్పడం తప్ప. హీరో హీరోయిన్ దగ్గరకు వెళ్లి `నేనే బుజ్జిగాడ్ని` అని చెప్పేస్లే క్లియర్ అయిపోయే కథ ఇది. కానీ చెప్పడు. హీరోయిన్ ఎక్కడుందో అని ఓ గ్యాంగ్ తెగ వెదికేస్తుంటుంది. టెక్నాలజీ పెరిగిపోయిన ఈరోజుల్లో కూడా ఈ దాగుడు మూతల ఆటేంటో అర్థం కాదు. ఆసుపత్రి సీన్ అయితే… ప్రేక్షకుల సహనానికి అసలైన పరీక్ష పెడుతుంది. దాదాపు 15 నిమిషాల పాటు సాగే సన్నివేశం అది. అది ఎందుకోసం తీశారో అర్థం కాదు. కేవలం సినిమా నిడివి పెంచుకోవడానికీ, ఈ సినిమా ఉన్న కాస్తో కూస్తో ఆసక్తిని చంపేయడానికి తప్ప ఎందుకూ ఉపయోగపడదు. అదేంటి.. ఇలాంటి సన్నివేశాలు కోకొల్లలుగా కనిపిస్తాయి.
రాజ్ తరుణ్ చాలా రోజుల తరవాత హుషారైన పాత్రలో కనిపించాడు. తన ఎనర్జీని దర్శకుడు సరైన రీతిలో వాడుకోలేకపోయాడు గానీ, తరుణ్ మాత్రం శాయశక్తులా కృషి చేశాడు. మాళవిక నాయర్ పద్ధతిగా ఉంది. హెబ్బా పటేల్ ది మరీ అతిథి పాత్ర అయిపోయింది. సప్తగిరి, సత్య లాంటి వాళ్లున్నా సరిగా వాడుకోలేదు. అంతెందుకు.. వాణీ విశ్వనాథ్ అనగానే చాలా ఊహించుకుంటాం. కానీ ఆమె ఇచ్చిన కాల్షీట్లూ ఫలితాన్ని ఇవ్వలేదు.
పాయింట్ ఓకే అనిపిస్తుంది. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం సరిగా లేదు. అనూప్ పాటలు, ఇచ్చిన నేపథ్య సంగీతం ఇవేమీ కొత్తగా అనిపించవు. బడ్జెట్ పరిమితులూ తెరపై కనిపిస్తుంటాయి. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు నవ్విస్తాయేమో… ఓవరాల్ గామాత్రం బుజ్జిగాడు నిరాశ పరుస్తాడు.
తెలుగు360 రేటింగ్ 2.25/5