ఏపీలో ఎక్కువ కుటుంబాలు సఫర్ అవుతున్న మ్యాటర్ జగన్ రెడ్డి బ్రాండ్లు. ఓ వైపు ఇల్లు గుల్లు. మరో వైపు నాసిరకం మద్యం. మద్యం దుకాణాల దగ్గరకు వెళ్లి మందుబాబుల్ని కదిలిస్తే జగన్ రెడ్డిపై స్తోత్రాలు వినిపిస్తూంటారు మందుబాబులు. ఆ అసంతృప్తిని చంద్రబాబు పక్కాగా పట్టుకున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ కనిగిరిలో ఏర్పాటు చేసిన రా కదిలిరా బహిరంగసభలో కొత్తగా మద్యం హామీ ఇచ్చారు.
జగన్ రెడ్డి నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలను పీల్చి పిప్పి చేస్తున్నారని..టీడీపీ రాగానే ఆ మద్యం మొత్తం తీసేసి అసలైన బ్రాండ్లను తక్కువ ధరకే అందిస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు హామీ కాస్త అతిశయోక్తిగా అనిపించవచ్చు కానీ.. అత్యంత కీలకమైన హామీగా భావించవచ్చు. మద్యం అనేది ఏపీలో చాలా కోర్ అంశం. ఏ ఇద్దరు కలిసినా దానిపైనే మాట్లడుకుంటారు. వ్యూహాత్మకంగా చంద్రబాబు ఈ హామీని ఇచ్చారనుకోవచ్చు.
చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ఓ రేంజ్ లో ప్రారంభించారు. ఈ నెల రోజుల పాటు ఆయన ప్రజల్లోనే ఉండనున్నారు. ఇప్పటికే వంద స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసుకుని పని చేసుకోమని సూచించారు. జనసేనకు ఇచ్చే సీట్లపైనా ఓ స్పష్టతకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఓ వైపు నిజం గెలవాలి పేరుతో నారా భవనేశ్వరి కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. నారా లోకేష్ మరో తరహా ప్రచార కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ఏపీ వ్యాప్తంగా ఓ రౌండ్ ప్రచారం పూర్తి చేయాలనుకుంటున్నారు.