ఒకప్పుడు సినిమా అంటే థియేటర్… థియేటర్ అంటే సినిమా. కానీ కాలం మారింది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ కనమరుగౌతున్నాయి. ఒకప్పుడు ట్రాక్టర్లు కట్టుకొని వచ్చి సినిమాని ఆస్వాదించేలా చేసి థియేటర్ల ప్రభ క్రమంగా మసకబారుతోంది. దీనికి చాలా కారణాలు. కాలంతో పాటు చాలా మారాయి. వినోద మధ్యమాలు పెరిగాయి. టీవీలు వచ్చాయి. థియేటర్స్ ని ఫీడ్ చేయగల కంటెంట్ రావడం తగ్గింది. మల్టీ ఫ్లెక్స్ లు పెరిగాయి. ఆ దశలో సింగిల్ స్క్రీన్ ని నడపడమే ఒక భారంగా మారింది. అన్నిటికీ మించి ఓటీటీ విప్లవం థియేటర్స్ మనుగడపై పెద్ద దెబ్బేకొట్టింది.
ఇప్పటికే మెజార్టీ ప్రేక్షుకులు థియేటర్స్ కి రావడం తగ్గించేశారు. సరైన సినిమాలు లేక, ప్రేక్షకుల ఆదరణ లేక చాలా థియేటర్స్ మూతపడ్డాయి. వాటి స్థానంలో గోడాన్స్, ఫంక్షన్ హాల్స్, షాపింగ్ మాల్స్ వెలిశాయి. రెండు దశాబ్దాల కిందట వరకు తెలుగు రాష్ట్రాల్లో 3,600 థియేటర్లు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 1,400కు తగ్గిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే.. మరో మూడేళ్ళలో మరో యాభై శాతం థియేటర్స్ మూతపడిపోతాయని ఇటీవల నిర్మాత బన్నీ వాసు తేల్చి చెప్పారు. ఈ లెక్కలు కచ్చితంగా చిత్రసీమని కలవరపెట్టేవే.
Also Read : థియేటర్ Vs ఓటీటీ… తీర్పు మారుతోందా?
ఒకప్పుడు థియేటర్ కి వెళ్ళే చూసేదే సినిమా. కానీ ఇప్పుడు సినిమా అంటే ఓటీటీ మాధ్యమం గుర్తుకు వస్తుంది. ప్రభాస్ కల్కి సినిమాని కూడా ఓటీటీలో చూద్దామనుకొని భావించిన వారి శాతం చాలా ఎక్కువ వుందని స్వయంగా బన్నీవాసు లాంటి నిర్మాత చెప్పడం చూస్తుంటే.. దాని ప్రభావం ఎంతలా వుందో అర్ధం చేసుకోవచ్చు.
నిజానికి జనాలు థియేటర్స్ కి రావడం తగ్గించేశారు. ఒక్కసారి సోషల్ మీడియా స్క్రోల్ చేస్తే అసలైన ట్రెండ్ ఏమిటో అర్ధమౌతుంది. ఆడు జీవితం, మహారాజా సినిమాల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా మాట్లాడుతున్నారు. సినిమాలోని మంచిని చర్చిస్తున్నారు. నిజానికి ఈ సినిమాలు థియేటర్స్ లో విడుదలై మంచి రివ్యూలు తెచ్చుకున్నాయి. కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సినిమా చూసినట్లుగా పెద్ద చర్చలు కనిపించలేదు. ప్రొఫెషనల్ గా రివ్యూలు ఇచ్చే సైట్స్ తప్పితే జనాల నుంచి రెస్పాన్స్ కనిపించలేదు. కానీ ఒక్కసారి ఓటీటీలో రిలీజైన తర్వాత మ్యాసీవ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే… ఎంత శాతం ఆడియన్స్ ని థియేటర్ బిజినెస్ కోల్పోయిందో అర్ధం చేసుకోవచ్చు.
ప్రతి మార్పులో మంచి చెడులు వుంటాయి. ఒక కొత్త మధ్యమం వచ్చినప్పుడు దాన్ని వాడుకొని ఇంకా అద్భుతమైన ప్రగతిని సాధించడం ఎలా అనే కోణంలోనే ముందుకు కదలాలి. ఓటీటీ విప్లవం మంచిదే. అంతమాత్రాన థియేటర్ బిజినెస్ ని నాశనం చేసి ఓటీటీని పెంచాలని అర్ధం కాదు. థియేటర్ రెవెన్యూ పడిపోవడం పరిశ్రమకే ముప్పు. ఇలా థియేటర్ బిజినెస్ ని కోల్పోవడానికి కారణం కూడా పరిశ్రమలో ఐకమత్యం లేకపోవడమే.
సినిమాని ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలనే రూల్ పెట్టుకున్నారు. రూల్ అనేది పెట్టడానికే తప్పితే పాటించడానికి కాదు. తమ సినిమాకి ఓ ఐదు కోట్లు ఎక్కువ ఇస్తామని ఆఫర్ చేస్తే .. ఆ రూల్ ని పక్కన పెట్టి రెండో వారానికే సినిమాని ఓటీటీకి ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నాడు నిర్మాత. దీనిని వలన ఆ సినిమా వరకూ సేఫ్ అవుతారేమో కానీ లాంగ్ రన్ థియేటర్స్ బిజినెస్ పూర్తిగా దూరమైపొతుందనే ప్రమాదాన్ని గ్రహించలేకపోతున్నారు. పెద్ద హీరోలకి కూడా 50 శాతం థియేటర్ బిజినెస్ పోతుందని పరిశ్రమ నుంచే వినిపిస్తోంది.
Also Read : చంద్రబాబు పిలుపు కోసం టాలీవుడ్ ఎదురు చూపు
ఓటీటీ పులిమీద స్వారీ లాంటిది. కేవలం దాన్నే నమ్ముకొని వెళ్తే ఒక దశలో సినిమా పరిశ్రమనే కిల్ చేసేస్తుంది. ఇది అందరికీ తెలుసు. జనాలని థియేటర్స్ కి తీసుకురావాలంటే ఓటీటీ గ్యాప్ పెంచాలి. ఇది అందరికీ తెలిసినా ఎవరూ చొరవ తీసుకోవడం లేదు. మలయాళం పరిశ్రమ ఈ విషయంలో ముందు చూపుతో అలోచించింది. అక్కడ థియేటర్స్ లో రిలీజై మంచి రెస్పాన్స్, కలెక్షన్స్ తెచ్చుకుంటేనే ఓటీటీ సంస్థల నుంచి కూడా మంచి ఆఫర్లు వచ్చేలా నిబంధనలు తెచ్చుకున్నారు. బాలీవుడ్ తెచ్చిన నిబంధనలు కూడా మంచి ఫలితాలు ఇచ్చాయి. సినిమా విడుదలై, మంచి వసూళ్లు తెచ్చుకొంటే, ఆ వసూళ్లని బట్టి ఓటీటీ రేటు పెంచుతారు. ”మీ సినిమా రూ.50 కోట్లు తెచ్చుకొంటే ఒక రేటు, వంద కోట్లు సాధిస్తే మరో రేటు” అనే నిబంధన మలయాళంలో ఉంది. అదే.. టాలీవుడ్ కీ అప్లై చేసుకోవొచ్చు. సినిమా బాగుండి, వసూళ్లు దండిగా వస్తే, ఓటీటీ రేట్లు ఎక్కడో ఉంటాయి. ఇక్కడ ఓ నష్టం కూడా ఉంది. సినిమా పోతే పరిస్థితి ఏమిటి? విడుదలకు ముందే ఉన్న ఓటీటీ రేటు, ఆ తరవాత ఉండదు కదా? కనీసం ఓటీటీ నుంచైనా ఎంతో కొంత సొమ్ము వస్తుందన్న ధీమా నిర్మాతలకు ఉండదు. అప్పుడు చిత్ర నిర్మాణం గణణీయంగా తగ్గిపోతుంది. కాకపోతే… లాంగ్ రన్ ని దృష్టిలో ఉంచుకొని, థియేటర్లని కాపాడుకోవాలన్న ఆలోచన నిర్మాతలకు ఉంటే, ఓటీటీ సంస్థల ఆధిపత్యానికి చరమగీతం పాడాల్సిందే. కానీ అది జరగడం లేదు.
తెలుగులో ఇంకా ఒంటెద్దు పోకడ విధానాలు కనిపిస్తున్నాయి. ఇది ఎక్కువ కాలం కొనసాగితే థియేటర్ బిజెనెస్ కి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం వుంది. తొందరలోనే ఈ విషయంలో సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఒకే విధానంపై నిలబడాల్సిన అవసరం ఎంతైనా వుంది.