హైడ్రా..ఇప్పుడిదే సంచలనం. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను గుర్తించి సినిమా తరహాలో కూల్చివేతలు చేపడుతోన్న హైడ్రాపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా సినీ, రాజకీయ ప్రముఖులకు చెందిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. ఇందులో భాగంగా ఒవైసీకి చెందిన ఫాతిమా కళాశాలను హైడ్రా కూల్చివేయబోతుంది అనే ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే ఈ వార్తలపై స్పందిస్తూ ఎంఐఎం శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి.. కానీ ఆ విద్యాసంస్థను మాత్రం కూల్చకండి అంటూ వ్యాఖ్యానించారు. బండ్లగూడలో ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థను నిరుపేదల విద్యార్థుల కోసం నిర్మించామని, అలాంటి విద్యా సంస్థను కూల్చకండి అంటూ పేర్కొన్నారు.
గతంలో తనపై కాల్పులు జరిగాయని, కావాలంటే మళ్లీ బుల్లెట్లు వర్షం కురిపించండి.. కత్తులతో దాడి చేయండి.. కానీ నిరుపేదల కోసం పాటుపడుతోన్న విద్యా సంస్థలను ధ్వంసం చేయకండి అంటూ అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. ఆయన చేసిన ఈ ప్రకటన వైరల్ అవుతోంది. అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్ తో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారా? లేక విజ్ఞప్తి చేశారా..? అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.