సూపర్ స్టార్ కృష్ణ సినీ జీవితంలో మర్చిపోలేని చిత్రం `పండంటి కాపురం`. యాక్షన్ హీరోగా ముద్ర పడిన కృష్ణను… కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేయడంలో `పండంటి కాపురం` చిత్రానిది కీలక పాత్ర. ఈ సినిమా విడుదలై నేటికి 50 ఏళ్లు. ఈ సినిమా నిండా ఎన్నో విశేషాలున్నాయి. అవన్నీ ఓసారి గుర్తు చేసుకొంటే..
* 1969లో రాజేష్ ఖన్నా హీరోగా నటించిన `దో రాస్తే` సినిమా విడుదలై సూపర్ హిట్టయ్యింది. ఆ సినిమాని రీమేక్ చేయాలని కృష్ణ ప్రయత్నించారు. కానీ… రీమేక్ రైట్స్ దొరకలేదు. దాంతో.. `దో రాస్తే`లోని ప్రధానమైన పాయింట్‌ని తీసుకొని `ద విజిట్` అనే ఇంగ్లీష్ సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలు కలుపుకొని ఈ కథ తయారు చేశారు. లక్ష్మీ దీపక్ ఈ చిత్రానికి దర్శకుడు.
* అప్పట్లో కలర్ ప్రింటు దొరకడం చాలా కష్టం. కలర్ సినిమా అంటే ఖరీదైన వ్యవహారమే. ఈ సినిమాని రూ.12 లక్షల బడ్జెట్ తో పూర్తి చేశారు. అప్పట్లో రూ.12 లక్షలంటే చాలా ఎక్కువ. దాంతో కృష్ణ చాలా రిస్క్ చేశాడని అంతా అనుకొన్నారు. అయితే ఈ సినిమా విడుదలై దాదాపుగా రూ.35 లక్షలు వసూలు చేసింది.
* 1972 జులై 21న విడుదలైన ఈ సినిమా 37 కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేయడం విశేషం.
* ఎస్వీఆర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఆయన కాల్షీట్లు దొరకడం చాలా కష్టం. పైగా.. షూటింగ్ కి ఆలస్యంగా వస్తారని ఆయనపై ఓ ఫిర్యాదు ఉండేది. అందుకే.. ముందు జాగ్రత్తగా అడిగిన దానికంటే ఎక్కువ పారితోషికం ఇచ్చి, చెప్పిన సమయానికి షూటింగ్ కి రావాలని షరతు పెట్టారు కృష్ణ. కేవలం పదంటే పది రోజుల్లో ఎస్వీ రంగారావుపై తీయాల్సిన సీన్లన్నీ తెరకెక్కించేసి, ఆయన్ని పంపేశారు. అప్పట్లో ప్లానింగ్ అంత పక్కాగా ఉండేది.
* ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్టే. `ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు` ఆల్ టైమ్ హిట్.
* నలుగురు అన్నదమ్ముల కథ ఇది. ఎస్వీఆర్, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, కృష్ణ అన్నదమ్ములుగా నటించారు. నరేష్ ఈ సినిమాలో తొలిసారి బాల నటుడిగా కనిపించాడు. జయసుధకు కూడా ఇదే తొలి చిత్రం.
* రాణీ మాలినీదేవి పాత్ర ఈ చిత్రానికి కీలకం. అన్నదమ్ముల మధ్య అనుబంధానికి బీటలు రావడానికి కారణం ఈ పాత్రే. పొగరున్న అమ్మాయి పాత్ర ఇది. దీన్ని భానుమతిని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేశారు. అయితే భానుమతి చివరి క్షణాల్లో హ్యాండ్ ఇవ్వడంతో ఆ పాత్రని జమునని తీసుకోవాల్సివచ్చింది. ఈ మార్పు చిత్రానికి మంచే చేసింది. జమునని అలాంటి పాత్రలో ఇదివరకెప్పుడూ చూసి ఉండకపోవడంతో… జమునకు కొత్తగా అనిపించింది. జమున కెరీర్లో ఇదో ఆణిముత్యంలా నిలిచింది.
* అప్పట్లో సూపర్ ఫామ్‌లో ఉన్న నటీనటులంతా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. వాళ్ల కాల్షీట్లు దొరకడమే గగనం అనుకుంటున్న తరుణంలో అందరినీ ఒకే ఫ్రేమలో చూపించడం మాటలు కాదు. షూటింగ్‌కి కనీసం 150 రోజులైనా పడుతుందని ముందు ఊహించారు. కానీ కేవలం 90 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం.