అక్టోబర్ 27 న జరగనున్న వైసిపి పాదయాత్ర వాయిదా పడనుందా? ఇదే చర్చ వైసిపి వర్గాల్లో రాజకీయవర్గాల్లో జోరుగా నడుస్తోందిప్పుడు.
అక్టోబర్ 27 నుంచీ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తానని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జగన్ అక్టొబర్ 27 శుక్రవారం అవుతుందని తెలియక అనాలోచితంగా ప్రకటించాడో లేక కోర్ట్ ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తుందని అతి విశ్వాసం తో ప్రకటించాడో తెలియదు కానీ, ఇప్పుడు అదే కొంప ముంచుతోంది. కోర్ట్ ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు నుంచి జగన్ ని మినహాయించడానికి తిరస్కరించిన దరిమిలా పాదయాత్ర ని ఎలా కొనసాగించాలనేది ప్రశ్నగా మారింది. అందులోనూ ప్రారంభమే శుక్రవారం పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా తేదీ మార్చాల్సిన అవసరం ఏర్పడింది.
అయితే ఇక్కడ కూడా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి ప్రణాళికలు వేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ తేది ని మార్చినా, ముహుర్తబలం లేకపోవడం వల్లే మారుస్తున్నామని పెద్ద యెత్తున ప్రచారం చేయడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. పైగా అలా చేయడం వల్ల, హిందూ విశ్వాసాలని, ముహుర్తాలని జగన్ నమ్ముతున్నట్టు, వాటికి విలువిస్తున్నట్టు ప్రజల్లోకి తీసుకెళ్ళినట్టవుతుందనీ, ఇది రాజకీయంగా లబ్ది చేకూరుస్తుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అధికారికంగా వైసిపి ఈ విషయం లో ఎలా స్పందించనుందో వేచి చూడాలి.