కడపజిల్లా ఇడుపులపాయలో వైఎస రాజశేఖర రెడ్డి సమాధి స్థలం దగ్గరనుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించిన సమయంలోనే తెలంగాణలోనూ వైఎస్ పాదయాత్రను స్మరించుకునే మరో సందర్భం రావడం విశేషం. వైఎస్ హయాంలో ప్రతి కొత్త కార్యక్రమం, యాత్రలూ అన్నీ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మొదలుపెట్టేవారు. అక్కడ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల చెల్లమ్మ అంటూ ఎంతో అభిమానించేవారు. మొదటి మహిళా హౌం మంత్రిని కూడా చేశారు. ఇప్పుడా చేవెళ్ల చెల్లమ్మ హౌదా పెరిగి అక్కయ్య కాబోతున్నారట. గతంలో వైఎస్ వీర విమర్శకుడా వుండినా ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎంఎల్ఎ రేవంత్ రెడ్డి కూడా ఆయన అడుగుజాడల్లో చేవెళ్లనుంచే తన యాత్ర ప్రారంభించాలనుకుంటున్నారు. అందుకే పార్టీలో చేరాక ముందుగా అక్కడకే వెళ్లి సబితను కలుసుకుని మాట్లాడారు. ఈ సందర్బంగా ఆమె ఆయనను సత్కరింపచేశారు కూడా. తెలంగాణలో రెడ్ల ప్రతినిదిగా తాను ప్రచారం పొందాలంటే వైఎస్ నమూనానే అనుసరించాలని రేవంత్ వ్యూహం. ఆ పైన సెంటిమెంటు. అందుకే ఇలాటి ఆలోచనలు చేస్తుండవచ్చు. వైఎస్ ఆకస్మిక మరణం వల్లనే కెసిఆర్ బలపడ్డారని చాలా మంది అంటుంటారు. ఇప్పుడు కెసిఆర్‌కు తనే ప్రత్యర్థినని భావించే రేవంత్ కూడా వైఎస్ నమూనాను అనుసరిస్తారనడంలో సందేహం లేదు.