చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించిన తరవాత… చిత్రసీమ తరపున ఘనమైన వేడుక జరుగుతుందని అంతా ఆశించారు. చిరు పద్మవిభూషణుడై ఇన్ని రోజులైనా అలాంటి వేడుక ఏం జరగలేదు. కనీసం… ఆ విషయం కూడా ప్రస్తావనకు రాలేదు. పద్మవిభూషణ్ అనేది చిన్న విషయం కాదు. తెలుగు చిత్రసీమలో ఏఎన్నార్ తరవాత, ఆ ఘనత దక్కింది చిరంజీవికే. అలాంటప్పుడు ఆయన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. చిరుకి పద్మ భూషణ్ వచ్చినప్పుడు కదిలొచ్చిన ఇండస్ట్రీ ఈసారి లైట్ తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ‘నాకు ఇలాంటి సత్కారాలేం అవసరం లేదు. ప్రేక్షకుల అభిమానం చాలు’ అని చిరంజీవి పెద్ద మనసుతో చెప్పినా – చిరుని గౌరవించుకోలేకపోవడం కచ్చితంగా లోటే.
చిత్రసీమలో చాలా విభాగాలున్నాయి. నిర్మాతల మండలి, ‘మా’ ఇవన్నీ యాక్టీవ్‌గానే పని చేస్తున్నాయి. అలాంటప్పుడు అందరూ కూర్చుని చిరు కోసం ఓ వేడుక ఏర్పాటు చేయాలని అనిపించలేదా? ముఖ్యంగా ‘మా’ ఈ విషయంలో మీన మేషాలు లెక్కించడం మరింత దురదృష్టం. ‘మా సభ్యుల ఆత్మగౌరవం’ అనే నినాదంతో అధ్యక్షుడైన మంచు విష్ణు, తమ సభ్యుడుకి ఇంత గౌరవం దక్కితే ఎలా మిన్నకుండిపోయాడో? ‘మా’ ఆవిర్భావం వెనుక చిరు కృషి ఎంతో ఉంది. ‘మా’కు తొట్ట తొలి అధ్యక్షుడు చిరంజీవినే. ‘మా’కి ఎలాంటి అవసరం వచ్చినా ముందుడే వ్యక్తి చిరు. అలాంటప్పుడు చిరు కోసం ఒక్క వేడుక ఏర్పాటు చేయలేకపోయారా? త్వరలో తెలుగు చిత్రసీమ 90 ఏళ్ల వేడుక ఘనంగా నిర్వహిస్తామని మంచు విష్ణు చెబుతున్నారు. 90 ఏళ్ల పండగంటే పెద్ద విషయమే. చిరుకి సత్కారం చేయలేని ‘మా’.. ఇంత పెద్ద వేడుక, బాధ్యత ఇప్పుడు భుజాలపై వేసుకోవడం ఇప్పుడు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తెలుగు ప్రభుత్వాలు ఎలాగూ చిరు సాధించిన ఘనత గుర్తించలేకపోయాయి. కనీసం చిత్రసీమకూ `పద్మవిభూషణ్` ఆనలేదు. అదే.. విచిత్రంగా తోస్తోంది.