అభినందన్ ను విడుదల చేస్తున్నట్టుగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అక్కడి పార్లమెంటులో ప్రకటించిన సంగతి తెలిసిందే. జెనీవా ఒప్పందాన్ని తాము గౌరవిస్తున్నట్టుగా చెప్పారు. భారత్ విషయంలో తాము శాంతి చర్చలకు ముందుడుగు వేస్తున్నామనే సందేశాన్ని అంతర్జాతీయ సమాజానికి ఇచ్చే విధంగా ఆయన మాట్లాడారు. ఇదే సమయంలో భారతదేశ రాజకీయాల గురించి మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇలాంటి జరుగుతూనే ఉంటాయన్నారు. అయితే, ఈ కోణంలో మోడీ ప్రభుత్వాన్ని తాము అనుమానించడం లేదనీ అన్నారు. తాను శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నానంటూ చెప్పారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ ఇలా మాట్లాడటం వెనక ఏదైనా వ్యూహం ఉందా అంటే… ఉందనే చెప్పాలి.
ఎఫ్ 16 యుద్ద విమానాల వాడకం విషయంలో పాకిస్థాన్ అడ్డంగా బుక్ అయిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. వాటిని వాడనేలేదంటూ గడచిన రెండ్రోజులుగా పాక్ చెబుతూ వచ్చింది. కానీ, మనదేశానికి చెందిన త్రివిధ దళాధిపతులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో… ఎఫ్ 16 ను వాడినట్టు సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. ఈ ఎఫ్ 16ని పాకిస్థాన్ కు అమెరికా ఇచ్చింది. పాక్ లో ఉన్న ఉగ్రవాదులను అణచివేసేందుకు మాత్రమే వీటిని ఉపయోగించాలి, ఇతర దేశాలపై ప్రయోగించకూడదన్నది ఒప్పందం. అయితే, దీనికి విరుద్ధంగా ఇప్పుడు భారత్ పైకి ఎఫ్ 16ను పాక్ పంపిందనేది స్పష్టమైపోయింది. అంటే, ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేస్తే… భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని పాక్ దాడికి దిగుతోందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలో అమెరికా, చైనా వంటి దేశాలతోపాటు… ఇతర దేశాల నుంచి పాక్ తీరుపై కొంత అసంతృప్తి వ్యక్తమయ్యే పరిస్థితి వచ్చింది.
ఈ నేపథ్యంలో తాము శాంతిని కాంక్షిస్తున్నాం, యుద్ధ కాంక్షతో లేమని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇమ్రాన్ ప్రసంగం ఉందని చెప్పొచ్చు. ఎఫ్ 16 ప్రయోగంతోపాటు, భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా వచ్చిన పాక్ యుద్ధ విమానాలు… ఈ దిశగా సాగుతున్న చర్చ నుంచి డైవర్ట్ చేయాలనేదే పాక్ లక్ష్యంగా కనిపిస్తోంది. దీన్లో భాగంగానే అభినందన్ ను భారత్ కు అప్పగించేందుకు పాక్ నిర్ణయించి ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం. వాస్తవానికి, పాక్ చెయ్యాల్సిన ప్రకటనలు ఇవి కాదు. సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను కూల్చేస్తామని అంతర్జాతీయ సమాజానికి భరోసా ఇవ్వాలి. ఆ పని చెయ్యకుండా చర్చను వేరేవైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు ఇమ్రాన్ ఖాన్.