తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, వెటర్నరీ పరీక్షలకు సంబంధించిన పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ప్రవీణ్ అనే ఉద్యోగి హనీ ట్రాప్ కారణంగా పరీక్ష పత్రాలు లీక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇటీవల జరిగిన గ్రూప్ 1 పరీక్ష లో కూడా ఇదే రకం అవకతవకలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష పత్రం సైతం ప్రవీణ్ లీక్ చేశాడేమో అన్న అనుమానాలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి. ప్రవీణ్ కూడా గ్రూప్ 1 పరీక్ష రాసినప్పటికీ ఆయన క్వాలిఫై కాలేదని తెలుస్తోంది. ఇక ఈనెల 15వ తేదీన జరగాల్సిన పరీక్షలు లీక్ కారణంగా రద్దయ్యాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో బిజీవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఉద్యోగార్థులు పెద్ద సంఖ్యలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసును చేరుకుని ఆందోళనకు దిగారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును ధ్వంసం చేశారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ని తక్షణమే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ మొత్తం వ్యవహారం కారణంగా గ్రూప్ 1 అభ్యర్థులతో పాటు, తెలంగాణలోని పలు పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు లోను అవుతున్నారు.