కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇంకా నెల్లూరు రాలేదు. కానీ ఆయనపై ఉన్న కీలక కేసుల్లో సాక్ష్యాలను మాత్రం నెల్లూరు కోర్టు నుంచి కొంత మంది మాయం చేశారు. మామూలుగా మాయం అయితే అవి జాగ్రత్తగా ఉంచాల్సిన కోర్టు ఉద్యోగుల మీద అనుమానం వస్తుంది కాబట్టి ఓ షిక్కటి చీకటి రాత్రిలో తాళాలు బద్దలు కొట్టి.. సాక్ష్యాలు తీసుకెళ్లిపోయారు. అవసరమైనవి మాత్రమే తీసుకెళ్లి.., మిగతావి కోర్టు ఆవరణలో పడేశారు. ఆ అవసరమైనవి అంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి పై ఉన్న ఫోర్జరీ కేసులో కీలక సాక్ష్యాలు మాత్రమే.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు విదేశాల్లో వేల కోట్ల ఆస్తులున్నాయని కొన్ని పత్రాలు కాకాణి మీడియా ముందు పెట్టి రచ్చ రచ్చ చేశారు. దానికి వైసీపీ మీడియా తోడయింది. చివరికి అవి ఫేక్ పత్రాలను.. ఫోర్జరీ చేశారని పోలీసులు గుర్తించి చార్జిషీట్ వేశారు. ఇందులో ఏ – వన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని ఆయనపై దాదాపుగా నేరం రజువుయింది. ఇలాంటి సమయంలో సాక్ష్యాలను దొంగలెత్తుకెళ్లిపోయారు. నెల్లూరులో ఇది తాజా సంచలనం.
చాలా చోట్ల దొంగతనాలు జరుగుతూ ఉంటాయి కానీ… కోర్టుల్లో దొంగతనాలు జరగడం.. ఇప్పటి వరకూ ఎప్పుడూ జరగలేదు. అదీ కూడా సెలక్టివ్‌గా సాక్ష్యాలను దొంగతనం చేయడానికే ఈ పని చేయించినట్లుగా కనిపిస్తూండటం అనూహ్యంగా మారింది. ఈ దొంగతనాన్ని పోలీసులు ట్రేస్ చేయలేరు.. దొంగల్ని పట్టుకోలేరు.. ఎవర్నైనా పట్టుకున్నా సాక్ష్యాలను స్వాధీనం చేసుకోలేరు.. అనేది కామన్‌గా జరిగే తర్వాత సీన్లు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడే పోలీసులు అందరి అంచనాలను తారుమారు చేయాల్సి ఉంది.