తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్ రెడ్డికి మొదటి టాస్క్ పార్లమెంట్ ఎన్నికలు. కేంద్రంలో జాతీయపార్టీకి పార్లమెంట్ సీట్లను సాధించి పెట్టడం ద్వారా ఆయన మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఇందులో నుంచి ఓస్థానాన్ని లాక్కోవడం కష్టం. మిగిలిన పదహారు స్థానాల్లోనూ కాంగ్రెస్ కు విజయావకాశాలు ఉంటాయి. గతం వేరు ఇప్పుడు వేరు. విజయం సాధించి…అధికారంలోకి వచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఉండే క్రేజ్.. రేవంత్ వంటి బలమైన నాయకత్వం తోడైతే స్వీప్ చేయడానికి అవకాశం ఉంటుంది.
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకూ.. సిద్దిపేట నియోజకవర్గంలో వచ్చే మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తూ వస్తోంది. అది తప్ప అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఈ సారి మంచి ఎడ్జ్ ఉంటుంది. పార్లమెంట్ సీట్లను గెల్చుకోవడానికి కూడా ఈ సారి బీఆర్ఎస్, బీజేపీ ఎక్కువ కష్టాలు పడాల్సి రావొచ్చు. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలిచినప్పటికీ.. జాతీయ రాజకీయాల ప్రాధాన్యంతో ఓటింగ్ జరుగుతుంది. దాని వల్ల జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.
పదిహేను స్థానాలను రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి… కాంగ్రెస్ హైకమాండ్ కు ఇవ్వగలిగితే… ఆయన స్థానం మరింత బలోపేతం అవుతుంది. ఆయనపై హైకమాండ్ మరింత నమ్మకం పెట్టుకుంటున్నారు. తెలంగాణ లో కొత్త చరిత్ర రాసే అవకాశం రేవంత్ రెడ్డికి లభిస్తుంది.