ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఆసీస్ ను ప్రపంచ కప్ 2023 విజేతగా నిలిపిన కమిన్స్ ను దక్కించుకోవడం కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడ్డాయి. చివరికి సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లకు కమిన్స్ ని దక్కించుకుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చాలా విషయాల్లో విమర్శలు ఎదురుకుంటుంది. గత సీజన్ లో మరీ దారుణమైన ఆట కనపరిచింది. జట్టులో స్టార్ ఆటగాళ్ళు కూడా కనిపించలేదు. జట్టు పేలవమైన ఆట తీరుని చూసి స్టేడియంకి వెళ్ళే ప్రేక్షకుల కూడా తగ్గిపోయారు. నాయకత్వ లేమి స్పష్టంగా కనిపించింది. దీంతో సరైన కెప్టెన్ కోసం ఎదురుచూసిన సన్ రైజర్స్ కోట్లని లెక్క చేయకుండా కమిన్స్ ని దక్కించుకుంది.
కమిన్స్ ట్రాక్ రికార్డ్ గురించి చెప్పాలంటే… మంచి ఫాస్ట్ బౌలర్. బ్యాటర్స్ ని ఒక్కిరిబిక్కిరి చేయగల బంతులు వేయగలడు. ఆసీస్ కు ప్రపంచ కప్ తో పాటు టెస్ట్ చాంపియన్ షిప్ ని సాధించి పెట్టడంలో అద్భుతమైన నాయకత్వ ప్రతిభ కనబరిచారు. ఐపీయల్ లో కూడా తన ట్రాక్ బావుంది. ఇప్పటి వరకూ ఆరు సీజన్స్ ఆడిన కమిన్స్ 45 వికెట్లు పడగొట్టాడు. అవసరమైనప్పుడు బ్యాట్ తో కూడా ఆదుకోగలడు. ఇవన్నీ ద్రుష్టిలో పెట్టుకొని కమిన్స్ ని సన్రైజర్స్ సొంతం చేసుకుంది. మరి అతడి రాకతోనైన జట్టు జాతకం మారుతుందేమో చూడాలి.