దేశాన్ని ఎలా బాగుచేయాలని అని ఆలోచించడం కాదు, ఆ మాట అంటేనే జోకులా నవ్వే రాజకీయ నాయకులున్న దేశం మనది. పైకి ఉపదేశాలిచ్చి లోన పచ్చి అవినీతిలో తలమునకలైన వారే ఎక్కువ. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే వారు తగ్గిపోయిన ఫలితంగా అనర్థాలు పెరుగుతున్నాయి. గుజరాత్ లో ఈమధ్య ఓ కొత్త ఆందోళన మొదలైంది. పటైల్ వర్గీయులను ఓబీసీల్లో చేర్చి రిజర్వేషన్ కల్పించాలని వేల మంది సభలు, ర్యాలీలు జరుపుతున్నారు. మంగళవారం నాడు అహ్మదాబాద్ లో భారీ సభ నిర్వహించారు.
పటేల్. గుజరాత్ లో రాజకీయంగా పైచేయి. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరిన కుటుంబాటే ఎక్కువ. సామాజికంగా అగ్రవర్ణం. వీరు కూడా ఓబీసీల్లో చేరాలని ఆందోళన చేస్తుంటే ఇక వెనుకబాటు అనం అనే మాటకు అర్థం ఏముంటుంది అని ఇతర ఓబీసీలు ప్రశ్నిస్తున్నారు. పటేళ్లకు వ్యతిరేకంగా ఓబీసీలు ఆందోళన బాట పట్టారు. వారికి ఓబీసీ హోదా ఇవ్వ వద్దని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పటేళ్లకు ఓబీసీ హోదా కుదరదని చెప్తోంది.
ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా గుజరాత్ లో పటేళ్ల రాజ్యం నడుస్తోంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా పటేల్ వర్గీయురాలే. గుజరాత్ లో ఆ వర్గానికి చెందిన వారు చాలా మంది ముఖ్యమంత్రులుగా పరిపాలనచేశారు. సీఎం పదవిలో లేకపోయినా చక్రం తిప్పిన పటేళ్లు చాలా మందే ఉన్నారు. ప్రవాస భారతీయుల్లోనూ పటేళ్లకు ఎంతో గుర్తింపు ఉంది. ఇప్పుడు వీరి ఆందోళన మరెందరికో స్ఫూర్తి ఇవ్వవచ్చు. వివిధ రాష్ట్రాల్లో కాస్త సంపన్న, సాజాజిక అగ్రవర్ణాలు అని పేరున్న వారు కూడా రిజర్వేషన్ల కోసం మళ్లీ ఆందోళకు దిగే అవకాశం ఉంది.
ఓటు బ్యాంకు రాజకీయాలు, అవినీతి తప్ప మరేదీ పట్టని స్వార్థ రాజకీయాల ఫలితమిది. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో నిజంగా ప్రజల కోసం పనిచేసిన రాజకీయ నాయకులు చాలా తక్కువైపోయి, అవినీతి పెరిగిపోయింది. ప్రజాస్వామ్యంలో రాజరికం వచ్చేసింది. రాజ్యాల్లాగా నియోజకవర్గాలను రాసిస్తున్నారు. డబ్బున్న వారికే టికెట్లు ఇస్తున్నారు. నోట్లు పెట్టి ఓట్లు కొంటున్నారు. ప్రజలను ఆలోచన లేని ఆటబొమ్మలుగా చేస్తున్నారు. ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చడానికి తాయిలాలు ప్రకటిస్తున్నారు. వారు ఆత్మగౌరవంతో బతకడం నేర్పడం లేదు. ప్రతిదానికీ ప్రభుత్వం ముందు చేయి చాపడం అలవాటు చేస్తున్నారు. ఇష్టారాజ్యం చెలాయిస్తున్నారు.
అందుకే, రిజర్వేషన్ల కోసం కొత్త కొత్త ఆందోళనలు పుట్టుకొస్తున్నాయి. పటేళ్ల రిజర్వేషన్ ఆందోళన ఎటు వైపు దారితీస్తుందో చూడాలి. వీరి స్ఫూర్తితో ఈ ట్రెండ్ ఇంకా పెరిగితే, వ్యతిరేకుల ఆందోళనలతో సమాజం మరింతగా ముక్కచెక్కలయ్యే అవకాశం ఉంది.