పవన్ కల్యాణ్ కెరీర్లో ఎక్కువగా రీమేక్ కథలే కనిపిస్తాయి. అవన్నీ మంచి విజయాల్ని అందించాయి కూడా. ఇప్పుడు కూడా పవన్ అరువు కథలపైనే ఆధారపడుతున్నాడు. పొలిటికల్ ఎంట్రీ తరవాత.. చేస్తున్న సినిమా `వకీల్ సాబ్` రీమేక్ కథే. సితార బ్యానర్లో, సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న సినిమా.. మలయాళ `అయ్యప్పయుమ్ కోషియమ్` కి రీమేక్. పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో ఓ సినిమా రూపొందనుంది. మైత్రీ మూవీస్ తెరకెక్కిస్తోంది. ఇది కూడా రీమేకే అని గట్టిగా ప్రచారం జరిగింది.
అయితే… పవన్ కోసం స్ట్రయిట్ కథనే తయారు చేసుకున్నాడు హరీష్. ఇటీవలే ఆ కథని పవన్‌కి వినిపించడం, పవన్ పచ్చజెండా ఊపేయడం జరిగిపోయాయి. ఈ కథ, దానికి హరీష్ ఇచ్చిన ట్రీట్మెంట్, క్యారెక్టరైజేషన్.. ఇవన్నీ పవన్‌కి బాగా నచ్చాయట. కథ విషయంలో.. సినిమాల్ని ఒప్పుకొనే విషయంలో పవన్ చాలా సమయం తీసుకుంటాడు. తనవైన మార్పులూ, చేర్పులూ జోడించి నగిషీలు దిద్దుతూ ఉంటాడు. పవన్‌కి ఏ కథా ఓ పట్టాన నచ్చదని చెబుతుంటారు. అయితే.. హరీష్ మాత్రం సింగిల్ సిట్టింగ్ లోనే ఈ కథని ఓకే చేయించుకున్నాడు. దాన్ని బట్టి.. పవన్‌కి ఈ కథ ఎంత నచ్చిందో అర్థం చేసుకోవొచ్చు,
గబ్బర్ సింగ్ తరవాత.. పవన్ పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా చేయలేదు. తనదైన హుషారు.. తన పాత్రలో చూపించలేదు. ఈసారి మాత్రం హరీష్ శంకర్… గబ్బర్ సింగ్ లా ఎనర్జిటిక్ పాత్రనే సృష్టించాడని టాక్. ఈ క్యారెక్టరైజేషన్ గురించి కూడా కొన్నాళ్లు చెప్పుకునేలా ఆ పాత్రని మలిచాడట. మొత్తానికి హరీష్ వల్ల… రీమేక్‌ల పరంపరకు పవన్ కాస్త బ్రేక్ ఇచ్చినట్టైంది.