పవన్ కళ్యాణ్ స్వరం మారుతోందా? మారిందా? నానినేషన్ల పర్వం ముగిసే సమయం దగ్గరకు వస్తోంది. ఇక మిగిలింది ప్రచారపర్వమే. ఈ పర్వంలో పవన్ కళ్యాణ్ తన స్ట్రాటజీ, తన స్వరం మార్చినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఒక మాట మీద వుండరు. తిడతారు..తనకు మళ్లీ శతృత్వం లేదు అంటారు. రెండు మాటలు జగన్ ను అంటే, ఒక మాట బాబును అంటారు. ఇలా రకరకాలుగా వుంటుంది ఆయన వైఖరి. కానీ ఇప్పుడు ఆయన మాటల్లో సంగతి అలా వుంచితే ఆలోచనల్లో క్లారిటీ కనిపిస్తోంది.
ఎటు మొగ్గాలి. ఎటు వుంటాలి అన్న ఆలోచనల్లో పవన్ ఓ స్పష్టతకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటి దాకా ఆంధ్రలో కేసీఆర్ జోక్యం మీద చంద్రబాబు మాటలు వినిపించాయి కానీ, మరెవరు మాట్లాడలేదు. కానీ పవన్ నిన్నటికి నిన్న మాట్లాడిన విషయాలు వేరుగా వున్నాయి. సూటిగా వున్నాయి. తెలంగాణలో ఆంధ్రుల కు ఏదో జరిగిపోతోందన్న భావన కలిగించేలా వున్నాయి. అంతే కాదు, నేరుగా తెరాసకు, వైకాపాకు బంధాలు వున్నాయని, జగన్ నేరుగా సరెండర్ అయిపోయారని పవన్ ఆరోపిస్తున్నారు.
పవన్ ఆరోపణలు, విమర్శలు దాదాపుగా జగన్ చుట్టూనే తిరుగుతున్నాయి. జగన్ ను జనాల ముందు దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం పవన్ మాటల్లో కనిపిస్తోంది. అంటే తన ప్రత్యర్థి లేదా తన టార్గెట్ జగన్ నే అన్న నిర్ణయానికి పవన్ వచ్చేసినట్లు కనిపిస్తోంది.
మరోపక్క తెలుగుదేశంతో అనధికార పొత్తు కుదిరింది అన్న పాయింట్ ను ఖండించే ప్రయత్నం పవన్ చేయడం లేదు. అస్సలు ఆ సంగతినే తన ప్రసంగాల్లోకి తీసుకురావడం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఎన్నికల అనంతర సీన్ ను పవన్ ముందుగానే తన ప్లాన్ లోకి తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది.
ఇధిలా వుంటే వైకాపా కూడా పవన్ ఆరోపణలను, విమర్శలను పెద్దగా తిప్పికోట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఎంతసేపూ చంద్రబాబును టార్గెట్ చేయడంతో సరిపోతోంది. చంద్రబాబు జగన్ ను తిడతారు. జగన్ చంద్రబాబును తిడతారు. ఈ ఇద్దరూ పవన్ ను పట్టించుకోరు. కానీ పవన్ మాత్రం తొంభై శాతం జగన్ ను టార్గెట్ చేస్తారు. ఓ పది శాతం తెలుగుదేశాన్ని కాకుండా, ఆ పార్టీలోని సెలెక్టెడ్ నేతలను టార్గెట్ చేస్తారు.
చిత్రమైన రాజకీయం నడుస్తోంది తెలుగునాట.