కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో దేశం స్వయం స్వావలంబన సాధిస్తుందని.. ప్రధానమంత్రి మోడీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తరవాత గట్టిగా నమ్ముతున్న వ్యక్తి జనసేన అధినేత పవన్ కల్యాణే. ప్యాకేజీకి రూపకల్పన చేసింది మోడీ, నిర్మలా సీతారామన్ కాబట్టి వారికి నమ్మకం ఉండటంలో తప్పు లేదు.. మరి పవన్ కల్యాణ్‌కు అంత నమ్మకం ఎలా వచ్చిందో తెలియదు కానీ.. తన నమ్మకాన్ని ఆయన .. మోడీ రెండో సారి ప్రధానిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా…సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ త్వరలోనే స్వావలంబన కలిగిన దేశంగా అవతరించబోతోందని పవన్ ప్రకటించేశారు. రెండో సారి ప్రధానిగా పదవి చేపట్టిన ఏడాది కాలంలో దేశం ఎన్నో చారిత్రక, ఎన్నో సాహసోపేత నిర్ణయాలను చూసిందని జనసేనాని పొగడ్తల వర్షం కురిపించారు. త్వరలోనే భారత్ స్వావలంబన సాధించి తీరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ 21వ శతాబ్దం భారత్‌దేనని చెప్పారు. ముందు చూపు, ధైర్యసాహసాలు కలిగిన ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో అది సాధ్యం అవుతుందన్నారు.
స్వచ్చభారత్, భారత్‌లో తయారీ వంటి పలు టైటిల్స్‌తో గతంలో మోదీ కార్యక్రమాలు ప్రారంభించారు. తాజాగా … నిర్భర ప్యాకేజీతో ..స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. భారత్‌లో తయారైన బ్రాండ్లను మాత్రమే వాడాలని పిలుపునిచ్చారు. ఇది ఎంత మేరకు ప్రజల్లోకి వెళ్లిందో కానీ.. పవన్ కల్యాణ్ మాత్రం.. స్వావలంబన సాధ్యమని గట్టిగా నమ్ముతున్నారు.