దామోదరం సంజీవయ్యను తమ పార్టీ ఐకాన్‌గా ముందుకు తీసుకెళ్లేందుకు దళితు వర్గాల్లో ప్రత్యేకమైన ఆదరణ పొందేందుకు పవన్ కల్యాణ్ సీరియస్‌గా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఇంటిని స్మారకంగా మార్చేందుకు రూ. కోటి ప్రకటించిన ఆయన.. ఇప్పుడు కొత్తగా కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ పేరు కడప జిల్లాకు పెట్టినట్లుగానే పెట్టాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. తమది డిమాండ్ కాదని.. ఒక హక్కుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే అధికార మార్పిడి తరవాత జనసేన ఆ ప్రక్రియ చేపడుతుందని స్పష్టం చేశారు.
దామోదరం సంజీవయ్య గురించి పవన్ కల్యాణ్ ఇటీవల ఎక్కువ పరిశోధన చేస్తున్నారు. మేధావులు, విద్యావేత్తలు, మాజీ సివిల్ సర్వీస్ అధికారులతో చర్చిస్తున్నారు. సంజీవయ్య విశిష్టతను, పాలన దక్షతను తనకు చెబుతున్నారని ఆయన అంటున్నారు. కేవలం రెండేళ్లే ముఖ్యమంత్రిగా పనిచేసినా ఆయన సేవలు వెలకట్టలేనివి, మరువలేనివి అని పవన్ అన్నారు. ఆరు లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను నిరుపేదలకు పంపిణీ చేశారని గుర్తు చేసుకున్నారు.
పవన్ కల్యాణ్ కులాల సమీకరణాల్లో బిజీగా ఉన్నారు. జనసేన పార్టీకి ఇతర వర్గాల నుంచి మద్దతు పొందే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో భాగంగా ఆదరణను నోచుకోని దామోదరం సంజీవయ్య లాంటి వారిని ఓన్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పవన్ ప్రయత్నాలు తెలిసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. దామోదరం సంజీవయ్య స్మారకాన్ని కాంగ్రెస్సేనిర్మిస్తుందని ప్రకటిస్తున్నారు. అయితే వారి వాయిస్ కన్నా ఇప్పుడు పవన్ వాయిసే ఎక్కువగా దళిత వర్గాల్లోకి వెళ్తోంది.