నేరస్వభావం ఉన్న క్రిమినల్స్ కు అధికారం అప్పగిస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని జనసేన అధినేతపవన్ కల్యాణ్ అన్నారు. రాత్రికి తమ పార్టీకి చెందిన వంద మందిని పోలీసులు అరెస్ట్ చేశారని.. తక్షణం వారందర్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో జనవాణి కార్యక్రమం కోసం విశాఖ వచ్చిన సందర్భంగా పవన్ కల్యాణ్‌కు స్వాగతం చెప్పడానికి వచ్చినవారు.. మంత్రులపై దాడులు చేశారని కేసులు పెట్టి.. కీలక నేతలందర్నీ అరెస్ట్ చేశారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు.
రాజకీయాల్లో క్రిమినలైజేషన్ జరిగితే ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయన్నారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని ఊరూవాడా తిరిగి చెప్పిన వ్యక్తి కింద ఇప్పుడు పోలీసులు పని చేస్తున్నారని.. ఇప్పుడు పోలీసులు నేరస్తులకు కొమ్ము కాస్తున్నారన్నారు. పోలీసులు తమ కార్యకర్తలపై జులుం ప్రదర్శించారన్నారు. పోలీసులు ఓ పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వైఎస్ వివేకా హత్య కేసును ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. పోలీసులు నిష్పాక్షికంగా ఉండాలని.. అరెస్ట్ చేసిన వారిని తక్షణం విడుదల చేయాలన్నారు.
తమ పార్టీ కార్యక్రమం మూడు నెలల కిందటే నిర్ణయమైందని… అయినా వైసీపీ వాళ్లు చెప్పినట్లుగా తాము తమ కార్యక్రమాలను ఎందుకు చేస్తామన్నారు. మంత్రులకు అధికారం లేదు కాని, 48 శాఖలు, 28 మంత్రులు ఒక వ్యక్తి చెప్పినట్లు వినాలా? అని ప్రశ్నించారు.వికేంద్రీకరణ అనేది ఒక్కరు తీసుకున్న నిర్ణయమని.. మండిపడ్డారు. ఒక్కరు తీసుకున్నదాన్ని వికేంద్రీకరణ అని ఎలా అంటారని ప్రశ్నించారు. బూతులు తిట్టడానికే వికేంద్రీకరణ అని మండిపడ్డారు. ప్రభుత్వ తీరు వల్ల సంస్థలన్నీ వెనక్కి పోయాయన్నారు. రాయలసీమలో అంతమంది ముఖ్యమంత్రులు వచ్చారని ఎందుకు అభివృద్ధి చేయలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
మరో వైపు పోలీసులు మాత్రం పవన్ కల్యాణ్ పై కూడా కేసులు నమోదు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే మంత్రులను చంపేందుకు జనసైనికులు వచ్చారని కేసు పెట్టడమే కాదు..మీడియాకు కూడా అదే చెప్పారు.