తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ,నాదెండ్ల భేటీ అయ్యారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయడంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైనా మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు బెయిల్ పై విడుదలైన తర్వాత పవన్ కల్యాణ్.. సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆ సమయంలో ఆయన వరుణ్ తేజ్ పెళ్లి కార్యక్రమంలో భాగంగా ఇటలీలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాతనే పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేసే విషయాన్ని ప్రకటించారు. ఇలా పొత్తు ప్రకటన తర్వాత చంద్రబాబును పవన్ కల్యాణ్ కలవలేదు. మొదటి సారి … ఇప్పుడు సమావేశం అవుతున్నందున పొత్తు అంశాలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ, జనసేన క్యాడర్ కింది స్థాయి వరకూ కలిసి పని చేసేలా కార్యాచరణ చేపట్టారు. సమన్వయ కమిటీ సమవేశాలు నిర్వహిస్తున్నరు. ఇవన్నీ పక్కాగా సాగితేపొత్తులు పెట్టుకున్న సమయంలో ఓట్ల బదిలీ సాఫీగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో జనసేన బీజేపీతో కలిసి పోటీ చేస్తోంది. ఈ రాజకీయం.. ఏపీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.. బీజేపీతో ఏపీలో ఎలా వ్యవహరించాలన్న అంశంపైనా పవన్ కల్యాణ్ చర్చించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమిత్ షాతో భేటీలో పవన్ కల్యాణ్ ఏపీ అంశాలపై ఏమైనా మాట్లాడి ఉంటే వాటిపైనా.. ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.