పారితోషికాల విషయంలో పవన్ కల్యాణ్ గేమ్ ప్లాన్ మారింది. సినిమాకింత అని కాకుండా, రోజుకి ఇంత అని తీసుకోవడం మొదలెట్టాడు పవన్. `వకీల్ సాబ్` కోసం పవన్.. ఒక్క రోజుకీ కోటి రూపాయల పారితోషికం తీసుకున్నట్టు ఇండ్రస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు `అయ్యప్పయుమ్ కోషియమ్`కీ అదే పద్ధతి పాటిస్తున్నట్టు టాక్.
సితార ఎంటర్టైన్మెంట్స్సంస్థ మలయాళ చిత్రం `అయ్యప్పయుమ్ కోషియమ్` ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ అడుగుపెట్టాక… ఈ రీమేక్ క్రేజ్ మరింత పెరిగింది. మరో హీరోని ఇంకా ఎంపిక చేయాల్సివుంది. అయితే.. హీరో ఎవరైనా ఈ సినిమాకి కేవలం రెండు నెలల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు. అందులోనూ పవన్ కేటాయించిన కాల్షీట్లు 30 మాత్రమేనట. ఈసారి కూడా పవన్‌కి రోజుల లెక్కనే పారితోషికం ఇవ్వబోతున్నార్ట. వకీల్ సాబ్ కంటే.. పవన్ ఇంకాస్త ఎక్కువ తీసుకోబోతున్నట్టు టాక్. `వకీల్ సాబ్` షూటింగ్ పూర్తయిన వెంటనే క్రిష్ సినిమా మొదలెట్టాలి. కానీ.. క్రిష్ చేతిలో ఇప్పుడు మరో ప్రాజెక్టు వుంది. వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్నాడు క్రిష్. అది పూర్తయ్యేలోగా.. పవన్ `అయ్యప్పయుమ్ కోషియమ్ ` రీమేక్ ని పూర్తి చేయాలని భావిస్తున్నాడు.
పవన్ తో ఎలా ఉంటుందంటే… తాను సెట్లో దిగేంత వరకూ సినిమాల సంగతి తేలడం చాలా కష్టం. ఈ షెడ్యూళ్లు, ప్లానింగులూ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు చేతిలో చాలా సినిమాలున్నాయి. అవన్నీ అనుకున్నట్టు పూర్తి చేయాలంటే పవన్ తొందర పడాల్సిందే. కాబట్టి ఈసారి `వకీల్ సాబ్` మొదలవ్వగానే… అదే ఊపులో `అయ్యప్పయుమ్ కోషియమ్`నీ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.