తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. చాలా రోజుల తర్వాత ఆయన తెలంగాణలో రాజకీయ పర్యటన చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రమాదంలో మరణించిన జనసేన క్రియాశీలక కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబాలకు తలా రూ. 5 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఫ్యాన్స్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. వారిని ఉద్దేశించి మాట్లాడిన పవన్ వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. భవిష్యత్తులో తెలంగాణలో జనసేన జెండా ఎగరడం ఖాయమన్నారు.
తెలంగాణ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిన యువత, ఆడపడుచులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై చర్చించి, కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తామని పవన్ అన్నారు. వచ్చే సార్వత్రికి ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అణగారిన వర్గాలకు, ఆడపడచులకు జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేద్దామని నిర్ణయించుకున్నాం. అయితే కొన్ని కారణాల వల్ల నా మాటను మన్నించి ఇక్కడి నేతలు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
వచ్చే సార్వత్రికి ఎన్నికల్లో తెలంగాణలో బలాబలాలు పరిశీలించుకుని అన్ని ప్రాంతాల్లో పోటీ చేద్దాం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేసి జనసేన సత్తా చూపిద్దమని క్యాడర్‌కు భరోసా ఇచ్చారు. అంటే తెలంగాణలో ఇక బీజేపీతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పడానికే పవన్ కల్యాణ్ ఈ పర్యటన పెట్టుకుని పర్యటనలు చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఏపీలో బీజేపీని వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు కీలకమవుతున్నాయి.