ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ప్రజా పోరాట యాత్రను పవన్ కొనసాగిస్తున్నారు. దీన్లో భాగంగా గజపతినగరంలో ఆయన మాట్లాడుతూ… తాము చేసిన అవినీతి ఏంటని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారనీ, అడుగడుగునా అది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతుల పొలాల కోసం వెళ్తున్న నీళ్లను, తెలుగుదేశం పార్టీ నేతల రొయ్యల చెరువులకు మళ్లిస్తున్నారని ఆరోపించారు.
ఇక, నిరుద్యోగ భృతిపై విమర్శల విషయానికొస్తే… దీనికి డిగ్రీ, లేదా డిప్లొమా అర్హత ఉండాలనంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు మారుతున్నారనీ, ఆడపడుచులూ అక్కచెల్లెళ్లు మారుతున్నారనీ, యువత మారుతోందన్నారు. నిరుద్యోగ భృతిని రూ. వెయ్యి చొప్పున ప్రకటించారనీ, అది కూడా అందరికీ కాదన్నారు. డిగ్రీ చదవకపోతే వారంతా యువత కాదంట అంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటివి మోసం చేసే పథకాలు తప్ప, యువతకు న్యాయం చేసేవి కాదని పవన్ మండిపడ్దారు. యువతను ఆకర్షించే పథకాలు ప్రవేశపెట్టినంత మాత్రాన నమ్మే పరిస్థితిల్లో ఏ ఒక్కరూ లేరని పవన్ అన్నారు.
బాగా చదువుకున్నవారికి అర్హతకు తగ్గ ఉద్యోగావకాశాలు లేకపోయే స్థితినే నిరుద్యోగం అంటాం! అలాంటివారికి చేయూతనందించే పథకమే నిరుద్యోగ భ్రుతి. కాబట్టి, దీనికి డిగ్రీ లేదా డిప్లొమా అనేది కనీస అర్హతగా పెట్టుకున్నారు. కానీ, పవన్ ఏమంటారంటే… డిగ్రీ చదవనివారు యువత కాదా, వారికి ఇవ్వరా అన్నట్టు అభిప్రాయపడుతున్నారు. అదెలా సాధ్యమౌతుంది..? విద్యార్హత ఉన్నా లేకున్నా యువత అందరినీ నిరుద్యోగులుగా చూడాలంటే.. ఆచరణ సాధ్యమా..?
టీడీపీని విమర్శించి తీరాలన్న గట్టి లక్ష్యంతో పవన్ యాత్రకు దిగారు కాబట్టి, ప్రతీరోజూ ఏదో ఒక అంశాన్ని పట్టుకుని విమర్శలు చేస్తున్నారు. తప్పులేదు, రాజకీయాల్లో విమర్శించుకునే స్వేచ్ఛ కచ్చితంగా ఉంటుంది. కాకపోతే, పథకాల విషయంలో ఆచరణ సాధ్యం కాని వ్యాఖ్యానాలు పవన్ చేస్తూ ఉండటం గమనార్హం. నిరుద్యోగ భృతికి కనీస అర్హత వద్దంటే ఎలా..? అమలు చేస్తున్న పథకాన్ని కూడా వంచనా, మోసం, మభ్యపెట్టడం అంటూ అభివర్ణిస్తుంటే ఎలా..?