డిప్యూటీ సీ.ఎం. హోదాలో పవన్ కల్యాణ్ ఈ రోజు చేసిన ఓ వ్యాఖ్య… టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయి కూర్చుంది. ఒకప్పుడు హీరోలు అడవుల్ని కాపాడే పాత్రలు చేశారు, ఇప్పుడు చెట్లని నరికి, స్మగ్లింగ్ చేసే పాత్రల్ని పోషిస్తున్నారు, మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తోందని పవన్ చేసిన కామెంట్లు ఇప్పుడు పెద్ద చర్చకే దారి లేపాయి.
పవన్ చెప్పింది అక్షరాలా నిజం. ఒకప్పుడు హీరో అంటే మంచోడు. బుద్ధిమంతుడు. ఏ చెడు అలవాట్లూ లేనివాడు. ‘రాముడు మంచి బాలుడు’ టైపు. కానీ రాను రాను… పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ‘నేను ఎంత ఎదవనో నాకే తెలీదు’ అని చెప్పడమే హీరోయిజం అయిపోయింది. ‘బుద్దిమంతుడు’, ‘పుణ్యాత్ముడు’ అనే టైటిళ్లు విన్న ఈ చెవులతోనే ‘ఈడియట్’, ‘పోకిరి’, ‘బద్మాష్’ లాంటి పేర్లు వినాల్సివచ్చింది. హీరో ఎంత వంకరగా ఉంటే, హీరోయిజం అంత బాగా పండుతుందని హీరోలు, డైరెక్టర్లు ఫిక్సయిపోయారు. అందుకే అడవుల్ని నరికి స్మగ్లింగ్ చేసేవాళ్లని సైతం హీరోలుగా పోట్రైట్ చేయడం మొదలెట్టారు.
పవన్ వ్యాఖ్యలు బన్నీని ఉద్దేశించినవే అన్నది కొందరి మాట. ‘పుష్ప’లో తనో స్మగ్లర్‌గా కనిపించాడు. బన్నీ ఈ పాత్రలో అద్భుతంగా నటించాడు, సినిమా సూపర్ హిట్.. ఇది వేరే మాట. కానీ… ఇలాంటి పాత్రలతో ఎలాంటి సంకేతాలు పంపాలని చిత్రసీమ చూస్తోంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ సినిమాలో నటనకు బన్నీకి జాతీయ అవార్డు వచ్చినప్పుడు కూడా ఇలాంటి విస్కృతమైన చర్చే సాగింది. ఓ స్లగ్లర్ పాత్రలో నటించిన నటుడ్ని జాతీయ ఉత్తమ నటుడిగా ఎలా గుర్తిస్తారు? అంటూ ఓ వర్గం గళం ఎత్తింది. దీనికి ఎవరి దగ్గరా సమాధానం లేదు.
అలాగని పవన్ కేవలం బన్నీని టార్గెట్ చేయడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని కూడా అనుకోలేం. పవన్ పకృతి ప్రేమికుడు. చెట్లని, తద్వారా పర్యావరాణాన్ని కాపాడాలన్న మంచి ఉద్దేశంతో పవన్ ఈ కామెంట్లు చేసి ఉండొచ్చు. తనకు ఇలాంటి పాత్రలు వచ్చినప్పుడు చేయడానికి చాలా ఇబ్బంది పడతానని ఓ హీరోగా తన అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. పవన్ ఇది వరకు జులాయి టైపు పాత్రలు కొన్ని చేశాడు. అయితే తన సినిమాల ద్వారా ఏదో ఓ రూపంలో సామాజిక సందేశాన్ని ప్రేక్షకులకు చేరవేసే ఉద్దేశం తనలో కనిపిస్తుంటుంది. అందుకే తన పాటల ద్వారా ఓ మంచి విషయం చెబుతూనే ఉంటాడు. కాబట్టి ఓ హీరోగా, సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా తన పాత్రని బాలెన్స్ చేసేశాడు. ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టే, మేం ఇలాంటి సినిమాలు తీస్తున్నాం అని దర్శకులు, హీరోలు పాత పాటే పాడితే ఏం చేయలేం కానీ.. ఈ విషయంలో సామాజిక బాధ్యత సినిమా వాళ్లకూ ఉంటుందన్న విషయాన్ని మాత్రం ఎవరూ విస్మరించకూడదు.