ఇటీవల పవన్ కల్యాణ్ తన నిర్మాతలతో భేటీ వేసిన సంగతి తెలిసిందే. ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్‌లు విడివిడిగా పవన్ కల్యాణ్‌ని కలుసుకొన్నాయి. సినిమా షూటింగులు, షెడ్యూళ్ల గురించి పవన్‌తో చర్చించాయి. పవన్ త్వరలోనే మేకప్ వేసుకోవడం ఖాయమని, ఆయన ఈ మూడు సినిమాలకు తలో కొన్ని డేట్లు కేటాయించారని ప్రచారం జరుగుతోంది.
అయితే తన దగ్గరకు వచ్చిన నిర్మాతలకు పవన్ ఓ కండీషన్ పెట్టినట్టు సమాచారం. తాడేపల్లికి దగ్గరల్లో ఎక్కడైనా సెట్ వేసుకోగలిగే అవకాశం ఉంటే, తను ఆ సినిమాకు వీలైనంత తొందరగా డేట్లు ఇస్తానని పవన్ మాట ఇచ్చినట్టు సమాచారం. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం హైదరాబాద్ లో ఆల్రెడీ భారీ సెట్ వేశారు. అక్కడే షూటింగ్ జరగాలి. ‘ఓజీ’ ముంబై నేపథ్యంలో సాగే కథ. కాబట్టి ఆ కథకు తాడేపల్లి చుట్టు పక్కల లొకేషన్లు దొరకవు. ఇక మిగిలింది ‘వీరమల్లు’. ఇదో చారిత్రక నేపథ్యం ఉన్న కథ. బ్లూమేట్ లో తీయాల్సిన సీన్లు కొన్ని ఉన్నాయి. సదరు సెట్లు ఎక్కడ వేసినా ఒక్కటే. కాబట్టి మిగిలిన సినిమాలకంటే ‘వీరమల్లు’ కు ఎడ్జ్ ఉంది. `ఓజీ`లో కొన్ని కీలకమైన ఘట్టాలు పోర్టు నేపథ్యంలో తెరకెక్కించాలి. ముంబై లేదా మలేషియాలో ఆయా సీన్లు తెరకెక్కించాలని భావిస్తున్నారు. పవన్ ఇప్పుడున్న పొలిటికల్ బిజీలో ముంబై, మలేషియా చుట్టూ తిరగడం కష్టమే. అయితే ‘ఉస్తాద్’ కోసం ఆయన హైదరాబాద్ వరకూ రాగలరు. పవన్ తో మీటింగ్ తరవాత ముగ్గురు నిర్మాతలూ మళ్లీ కలిసి వాళ్లలో వాళ్లు మాట్లాడుకొని ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.