జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్నారు. రాయలసీమలో సైతం కోస్తాంధ్ర , ఉత్తరాంధ్ర కు దీటుగా పవన్ కళ్యాణ్ కి స్పందన రావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇక ఈరోజు కడప లో బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇటు టిడిపి ని , అటు వైఎస్సార్ సీపీని చీల్చి చెండాడారు. కర్నూలులో జరిగిన సభలో కొంచెం మెత్తగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఆళ్లగడ్డ సభలో కొంచెం స్వరం పెంచి, కొన్ని కుటుంబాల కబంధ హస్తాలలో నుంచి రాయలసీమ బయటపడాల్సి ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఈరోజు కడప సభలో మాత్రం తన సహజ శైలిలో టిడిపి, వైఎస్ఆర్సిపి ల పై విరుచుకు పడ్డారు.
తొండలు గుడ్లు పెట్టని సీమలో నాయకులకు మాత్రం వేల కోట్లు వేల ఎకరాలు:
రాయలసీమ అనగానే ఇది కరువు కాటకాలతో నిండిన ప్రాంతమని, వెనుకబడిన ప్రాంతం అని అంటూ ఉంటారు అని, ఇక్కడ తొండలు కూడా గుడ్లు పెట్టవు అని వ్యాఖ్యానిస్తూ ఉంటారని, కానీీ తొండలు కూడా గుడ్లు పెట్టని ఈ రాయలసీమ లో రాజకీయ నాయకులకు మాత్రం వేల కోట్లు , వేల ఎకరాలు ఉంటాయి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక్కడ జనాలు మాత్రం గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్నారని , ఇంతమంది రాయలసీమ నుండి ముఖ్యమంత్రులుగా మారినప్పటికీ రాయలసీమ లో పరిశ్రమలు రాలేదని, ముఠా నాయకుల కమిషన్లకు భయపడి పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమలు పెట్టడం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
కొత్త తరం రాజకీయాన్ని తీసుకొస్తాం అన్న పవన్ కళ్యాణ్
రాయలసీమ ప్రాంత రాత మారాలంటే ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛ కావాలని, రాజకీయ నాయకులకు భయపడే పరిస్థితి పోవాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 10 కుటుంబాలు రాయలసీమను శాసిస్తున్నాయి అని ఆ కుటుంబాల నాయకులకు ప్రజలు భయపడే పరిస్థితి పోయినప్పుడే రాయలసీమ ప్రజల రాత మారుతుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
అలాగే, ఈ విధంగా ప్రజలను భయపెట్టే వాడు నాయకుడు కాదని ప్రజలకు భరోసా కల్పించే వాడే నాయకుడు అని పవన్ కళ్యాణ్ అన్నారు. కర్నూలు సభలో మాట్లాడుతూ రెడ్డి అంటే రక్షకుడు అని అర్థం అని, ప్రజల సొమ్ము దోచే వాడు రెడ్డి కాదని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ అదే వ్యాఖ్యలు చేశారు. అలా చేయడమే కాకుండా, కడప ప్రాంతంలో యురేనియం తవ్వకాలు అక్రమంగా జరుగుతూ ఉంటే దాని మీద ఒక రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదని, కానీ భరత్ రెడ్డి అనే ఒక యువకుడు దీనిపై పోరాడాడని చెబుతూ ఆ యువకుని వేదికమీదకు ఆహ్వానించారు. ప్రజల కోసం పోరాడే ఇలాంటి వాళ్లే జనసేన పార్టీకి కావాలని చెబుతూ, ఇలాంటి నాయకులతో కొత్త తరం రాజకీయ నాయకులను జనసేన తయారు చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ఆ పార్టీలో నాయకులను ఈ పార్టీలోనే నాయకులను లాక్కొని పార్టీని నిర్మించుకోవాలని తాను అనుకోవడం లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
టిడిపి ని ఉతికారేసింది జనసేన పార్టీ యే, వైయస్సార్సీపి అసెంబ్లీ నుంచి పారి పోయింది:
ఈ మధ్య వైయస్సార్ సిపి నాయకులు తాను టిడిపితో కలిసి పోటీ చేస్తానని అంటున్నారని, తాను టిడిపితో కుమ్మక్కయ్యారని బురద చల్లుతున్నారని, కానీ అసలు టిడిపిని ఉతికేసింది జనసేన పార్టీ యే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీ నుండి పారిపోయారు అని ఎద్దేవా చేసిన పవన్ కళ్యాణ్, తన పార్టీకి ఒక కౌన్సిలర్ కూడా లేకపోయినప్పటికీ అనంతపురం జిల్లాలో జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు అని చెప్పుకొచ్చారు.
జనసేన కేవలం కమ్యూనిస్టులతో మాత్రమే పొత్తు పెట్టుకుంటుందని, 2019 ఎన్నికల్లో టిడిపి తో కాని అటు వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకోదని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ రెండు పార్టీలు తాము ఎల్లకాలం వారికి పల్లకి మోయాలని భావిస్తున్నాయని, కానీ వాళ్ళకి పల్లకి మోసింది ఇక చాలు చాలు చాలు అని పవన్ కళ్యాణ్ ఆవేశంగా ప్రసంగించగా సభా ప్రాంగణం మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. అసంఖ్యాకంగా హాజరైన జనసేన అభిమానులు ఎప్పటి లాగానే సీఎం నినాదాలతో సభను హోరెత్తించారు.
మొత్తం మీద:
మొత్తం మీద కర్నూలు సభలలో కాస్తంత సంయమనంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, కడప సభలో మళ్ళీ తన సహజ శైలిలో కి వచ్చి, పదునైన వాగ్బాణాలు విసిరారు. కడప జిల్లాలో సభ పెట్టి మరి జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాయలసీమ ప్రజలను నేతలు బెదిరిస్తున్నారు, వారి కబంధ హస్తాల్లో ఉంచుకుంటున్నారు, అక్రమార్జనతో వచ్చిన డబ్బులతో ఈ ప్రజల జీవితాలను నియంత్రిస్తూ ఉన్నారు అని కొత్త తరహా విమర్శలు చేస్తూ ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నారు. మరి ఈ కొత్త తరహా రాజకీయానికి ప్రజలు ఎంత వరకు ఆమోదం తెలుపుతారని ఎన్నికలయ్యాక తెలుస్తుంది
– జురాన్ (@CriticZuran)