2024 అసెంబ్లీ ఎన్నికల ముందు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు పవన్ కల్యాణ్. ఆ తరవాత రాజకీయాలతో బిజీ అయిపోయారు. మంత్రిగా ఆయన నిర్విరామంగా పని చేస్తున్నారు. అయితే త్వరలోనే మళ్లీ పవన్ కెమెరా ముందుకు రావడానికి రంగం సిద్ధం అవుతోంది. ఆయన ‘ఓజీ’కి కొన్ని డేట్లు ఇచ్చారు. అక్టోబరు నుంచి ‘ఓజీ’ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఈ యేడాదిలో పునః ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ కు సైతం పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
దర్శకుడిగా క్రిష్ బాధ్యతల నుంచి తప్పుకొన్న తరవాత ఈ సినిమాని పూర్తి చేసే బాధ్యత జ్యోతికృష్ణ భుజాలపై పడింది. ఇప్పుడు ఆయన కొత్త షెడ్యూల్ మొదలు పెట్టారు. దాదాపు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్ల నేపథ్యంలో ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ లోనే త్వరలో పవన్ కల్యాణ్ పాలు పంచుకోనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఎ.ఎం.రత్నం సమర్పణలో ఈ చిత్రాన్ని దయాకర్ రావు నిర్మిస్తున్నారు. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రధారులు. 2024లో తొలి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టీజర్ కూడా విడుదల చేశారు.