ఎన్నికల్లో లబ్ది కోసమే బీజేపీ యుద్ధం తెచ్చి పెట్టే ప్రయత్నాలు.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచుతోందన్న ఉద్దేశంతో నేతలు చేస్తున్న ప్రకటనలు పాకిస్తాన్ మీడియాకు గొప్ప అవకాశంగా దొరుకుతున్నాయి. పాకిస్తాన్ లో నెంబర్ వన్ దినపత్రికగా ఉన్న ది డాన్… రాజకీయ నేతల అనుమానాస్పద ప్రకటనలకు అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తోంది. కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలను.. ప్రముఖంగా ప్రచురించిన డాన్ పత్రిక బీజేపీ ఉద్దేశం ఎన్నికల్లో లబ్ది పొందడానికి మాత్రమేనని తేల్చి చెప్పింది. దానికి యడ్యూరప్ప మాటలను సాక్ష్యంగా వాడుకుంది. ఎయిర్‌స్ట్రైక్స్ వల్ల బీజేపీకి కర్ణటాకలో ఇరవై రెండు సీట్లు వస్తాయని..యడ్యూరప్ప బహిరంగంగానే చెప్పుకొచ్చారు. దీన్నే ఆ పత్రిక కోట్ చేసి.. బీజేపీ కేవలం ఎన్నికల కోసమే యుద్ధం తెచ్చి పెడుతోందన్న అర్థంలో అక్కడి ప్రజలకు సమాచారం చేరవేసింది.
యడ్యూరప్ప ఒక్క విషయంలోనే కాదు.. జనసేన అదినేత పవన్ కల్యాణ్ మాటలను కూడా డాన్ పత్రిక ఈ కోణంలో ప్రజలకు తెలియజేసింది. కడప జిల్లాలో మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఎన్నికలకు ముందు యుద్ధం వస్తుందని.. రెండేళ్ల కిందటే.. బీజేపీ నేతలు తనకు చెప్పారని.. ప్రకటించారు. ఈ ప్రకటనకు వెబ్ మీడియాలో విశేష ప్రచారం లభించింది. అప్పట్లో పవన్ కల్యాణ్ బీజేపీతో సన్నిహితంగా ఉండటంతో ఆయనకు బీజేపీ నేతలు చెప్పి ఉంటారన్న ఊహాగానాలు వినిపించారు. నేషనల్ హెరాల్డ్ అనే పత్రికలో వచ్చిన వెబ్ లింక్‌తో… పాకిస్తాన్ పత్రిక డాన్.. ఈ వార్తను వెబ్ సైట్లో ఉంచింది. ఇండియా – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతారవణాన్ని లైవ్ బ్లాగ్ ద్వారాఅందిస్తున్న డాన్..యుద్ధం వస్తుందని బీజేపీ నేతలు రెండేళ్లకిందటే చెప్పారని రిపోర్ట్ చేసిన కథనం లింక్‌ను ఇచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ పాకిస్తాన్ లోనూ ప్రచారంలోకి వచ్చారు.
భారత్ – పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో పాకిస్తాన్ మీడియా చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తోంది. ఊహాగానాలను ప్రచారం చేయడం లేదు. అలాగే.. సొంతంగా ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. జరిగింది… జరిగినట్లు మాత్రమే రిపోర్ట్ చేస్తోంది. అయితే.. బీజేపీ ఎన్నికల కోసమే యుద్దం చేయడానికి అవుతోందన్న అర్థంలో భారత రాజకీయ నాయకులు ఇచ్చే ప్రకటనల్ని యథావిధిగా అందిస్తోంది. దాంతో.. తప్పు అంతా..భారత్ దే అన్నట్లు గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తోంది. దానికి భారత రాజకీయ నేతలే తమ ప్రకటనల ద్వారా సహకరిస్తున్నారు.