జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇటీవలి కాలంలో ట్వీట్లు చేసినా.. ప్రసంగించినా… ఒక్క మాట ప్రముఖంగా చెబుతున్నారు. అదే కాన్షీరాం స్ఫూర్తితో రాజకీయాలు చేస్తానని.. చెబుతున్నారు. గతంలో జ్యోతిరావు బాపూలే లాంటి మహానుభావుల ప్రస్తావన తెచ్చేవారు కానీ.. కాన్షీరాం ప్రస్తావన తెచ్చేవారు కాదు. కానీ ఇటీవలి కాలంలో.. కాన్షీరాం జీవితం, ఆయన పార్టీ పెట్టిన వైనం, దాన్ని నడిపిన వైనంపై.. ఏదైనా పుస్తకంలో చదివారేమో కానీ.. స్ఫూర్తి పొందారు. కాన్షీరాం మార్క్ రాజకీయాలని చెబుతున్నారు.
రెడ్లను రక్షకులుగా తీర్పునివ్వడం కాన్షీరాం స్ఫూర్తినా..?
కాన్షీరామ్ సాధారణమైన మనిషి కాదు. తన సర్వస్వమూ త్యాగం చేసి దళితులకు రాజ్యాధికారం కోసం ఆయన పోరాడారు. అంబేద్కర్ తర్వాత భారత దేశంలో దళితుల్లో తొలుత చైతన్యం తీసుకువచ్చిన వారు కాన్షీరామ్. ఆయన లేకపోతే ఉత్తరప్రదేశలోనే కాక, అనేక ఇతర రాష్ట్రల్లో ఇవాళ దళితులు ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి ఉండేవారు కాదు. దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు సంఘటితమై తమ ఓటు బలం ద్వారా ప్రజాస్వామ్య రూపురేఖల్ని మార్చవచ్చునని నిరూపించే ప్రయత్నం చేసిన నేత. మరి పవన్ కల్యాణ్.. ఈ స్ఫూర్తిలో ఒక్క శాతం అయినా తీసుకున్నారా..?. అస్సలు లేరు.. కర్నూలుకు పోయి రాజ్యాధికారం తమ హక్కు అనుకుంటున్న రెడ్లను పొగడటానికి ప్రాధాన్యం ఇచ్చారు. రెడ్డి అంటే పాలకుడున్నట్లుగా.. వాళ్లే రక్షణదారులన్నట్లుగా.. చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి.. రక్షకుడు కాదు భక్షకుడు అని చెప్పడానికి ఇలాంటి ప్రయత్నం చేశారు కానీ పవన్ కల్యాణ్ ఉద్దేశం మాత్రం రెడ్లు అంటే.. పాలకులు అన్నట్లుగా ఉంది. ప్రజాస్వామ్య దేశంలో.. కులమతాలకు అతీతంగా అందరికీ పాలించే హక్కు ఉంది. ఎవరూ ఎవరికీ రక్షకుడు కాదు. రాజ్యాంగమే అందరికీ రక్ష. కాన్షీరాం కూడా అదే చెప్పారు.
కాన్షీరామ్ పోరాట శైలిని ఒక్క శాతం అయినా పుణికిపుచ్చుకున్నారా..?
దళితుల్లో చైతన్యం తీసుకువచ్చి, వారికి రాజకీయ, సామాజిక, ఆర్థిక స్వాతంత్య్రం, సాధికారికత తీసుకువచ్చేందుకు తన సర్వస్వం త్యాగం చేసి ఉద్యమించిన నేత కాన్షీరామ్. బుద్ధుడిలాగా కుటుంబంతో తెగతెంపులు చేసుకున్నారు. దళితులకు రాజ్యాధికారం కోసం ప్రయత్నించారు. కానీ పవన్ కల్యాణ్.. ఆ పంధాలో ఇప్పటి వరకూ ఒక్క పోరాటం కూడా చేయలేదు. కులం కోసం కాకపోయినా.. కనీసం రాష్ట్రం కోసం అయినా..ఏ పోరాటం అయినా నిలకడగా చేశారా.. అంటే అదీ లేదు. ఐదేళ్ల సమయంలో.. ఆయన ఏపీలో లో ఉన్న పదమూడు జిల్లాల్లో కూడా పర్యటించలేకపోయారు. కానీ కాన్షీరామ్.. దేశం మొత్తం తిరిగారు. విజయవాడ నుంచి ఆచంటకు… కూడా హెలికాఫ్టర్లో వెళ్లే పవన్ కల్యాణ్.. కాన్షీరాం.. పోరాట శైలి గురించి పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంది. ఆయన వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశారు.. వందల కిలోమీటర్లు నడిచారు. ఆ పోరాటం ఫలితామే.. బీఎస్పీ.. దళితులందరూ.. తమ పార్టీ అనే చెప్పుకునే స్థితికి ఎదిగింది. కానీ.. పవన్ కల్యాణ్.. పోరాటం ఏ స్థాయిలో ఉంది..? తన సిద్ధాంతాలపై తనకైనా క్లారిటీ ఉందా..?
బడుగు, బలహీన వర్గాలకు జనసేనలో ఎంత ప్రాధాన్యం ఉందేమిటి..?
జనసేనలో ఇప్పటికి చాలా కమిటీలు వేశారు. సమాజంలో.. అట్టడుగున ఉండిపోయిన వారికి ఎలాంటి ప్రొత్సహం ఇచ్చారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో ఒక్కరంటే.. ఒక్క దళితుడికైనా అవకాశం ఇచ్చారా..? జిల్లా స్థాయి.. నియోజకవర్గ స్థాయి.. మేనిఫెస్టో కమిటీ.. అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ.. ఇలా చాలా చాలా… కమిటీలు వేశారు. ఇందులో.. దళితులకు ఎంత భాగస్వామ్యం ఇచ్చారో.. ఓ నివేదిక విడుదల చేయగలరా..? . కాన్షీరాం పేరు వాడేసుకుంటే … ఆయన స్ఫూర్తి అని చెబితే.. సరిపోదు… దానికి తగ్గట్లుగా.. కార్యాచరణ ఉండాలి. అప్పుడే… ఆయన పేరును ఉపయోగించుకోవడానికి అర్హత వస్తుంది. లేకపోతే.. ఫక్తు రాజకీయ నాయకుల్లా ఉండిపోతారు.