జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నారు. సుదీర్గమైన కాలం అమల్లో ఉండేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇదంతా సినిమా కెరీర్‌కు సంబంధించే. ఆయన షెడ్యూల్ చాలాబిజీగా ఉంది. కానీ మరో వైపు చూస్తే ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఎప్పుడు సమయం కేటాయిస్తారో తెలియని పరిస్థితి. ఎన్నికల మూడ్ ఇప్పటికే వచ్చేసింది. ముందస్తు ముచ్చట కూడా వినిపిస్తోంది. ముందస్తు లేకపోయినా మరో రెండేళ్లలో పోలింగ్ కూడా జరిగిపోతుంది. అంటే ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు సిద్ధమవ్వాల్సిన పరిస్థితి.అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష తెలుగు దేశం ఇప్పటికే ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. కానీ మరో ప్రధాన పార్టీగా ఉన్నజనసేన ఉనికే సోషల్ మీడియాలోనూ.. పవన్ కాల్షీట్లు ఇచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ తనకు సినిమా బతుకు దెరువు అని చెబుతున్నారు. అదే సమయంలో రాజకీయాలు తనకు అత్యంత ఇష్టమని చెబుతున్నారు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంది . కానీ ఈ విషయంలో ఆయన ఫెయిలవుతున్నారని తాజా పరిణామాలను బట్టి తెలుసుకోవచ్చు. పార్టీ కోసం పవన్ కేటాయిస్తున్న సమయం చాలా తక్కువగా ఉంది. జనసేన వ్యవహారాలు నాదెండ్ల మనోహర్ ఒక్కరే చూస్తున్నారు. సినిమా షూటింగ్లలో తీరిక దొరికినప్పుడు ఓ ఆందోళన కార్యక్రమం.. మరో సభ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తర్వాత యూట్యూబ్ వీడియోలు… ప్రెస్ నోట్లకే పరిమితమవుతున్నారు. ఫలితంగా జనసేన క్యాడర్ రోజు రోజుకు కుంచించుకుపోయే పరిస్థితి ఏర్పడింది.
పవన్ కల్యాణ్ తన ఫుల్ టైం రాజకీయాలకు కేటాయించాల్సిన సమయం దగ్గర పడింది. కానీ ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం జనసేనకు రాలేదు. వచ్చేఅవకాశం కూడా లేదని పవన్ కల్యాణ్ బిజీ షెడ్యూల్‌తో తెలిసిపోతోంది. ఇంత కాలం అయినా జనసేనకు పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పవన్ అడుగు పెడితే జనసేన ఉన్నట్లు.. లేకపోతే లేదన్నట్లుగా ఆ పార్టీ రాజకీయం మారిపోయింది. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ జనసేనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఫుల్ టైం రాజకీయాలు చేయకపోతే … జనసేన పార్టీని ఎక్స్ ట్రాగానే జనం చూసే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల పవన్ కల్యాఅ్ రెంటికి చెడ్డ రేవడి అయ్యే అవకాశం ఉంది.