జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వం అంటే అవినీతికి పాల్పడుతుందని.. ఎమ్మెల్యేలంటే దోచుకుంటారనే గట్టి అభిప్రాయంతో ఉన్నారు. ఇంత భారీ అభిప్రాయానికి ఆయన ఎలా వచ్చారో కానీ… ముఖ్యమంత్రి స్థాయి నుండి.. ఎమ్మెల్యే వరకూ ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. వరుసగా అవినీతి ఆరోపణలు చేసుకుంటూనే పోతున్నారు. నాలుగో ఆవిర్భావ దినోత్సవంలో … చంద్రబాబు, లోకేష్ పై నేరుగా ఆరోపణలు చేశారు. తన దగ్గర ఆధారాలేమీ లేవని… జనం అనుకుంటున్నారని తర్వాత చెప్పుకొచ్చారు. అప్పుడే పవన్ కల్యాణ్ చేసే ఆరోపణల్లో సీరియస్ నెస్ తగ్గిపోయింది. అయినప్పటికీ.. ఆయన నేరుగా ఎవరిపైనైనా గురి పెట్టి ఆరోపణలు చేస్తే.. వారందరూ స్పందించారు. లోకేష్ నుంచి… పలాస ఎమ్మెల్యే శివాజీ వరకూ అందరూ స్పందించారు. మేము అంతగా అవినీతికి పాల్పడితే.. ఏదైనా ఒక్క ఆధారం బయటపెట్టు అని సవాల్ చేశారు. పలాసలో గౌతు శివాజీ ఈ ఆరోపణలను తట్టుకోలేక లీగల్ నోటీసులు కూడా పంపించారు.
కానీ దీనికి కౌంటర్ గా పవన్ కల్యాణ్.. “అవినీతికి రసీదులుంటాయా ఏంటీ..?” అనే వాదనను తెరపైకి తీసుకొచ్చారు. నిజమే అవినీతికి రసీదులుండవు. అలా అని… టేకిట్ గ్రాంట్ గా తీసుకుని ఆరోపణలు చేయడం హక్కుగా భావిస్తారా..?. నచ్చని ప్రతి ఒక్క నేతపై అలా బురద జల్లుకుంటూ పోతారా..? అలా చేయడం సమంజసమేనా..?. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి… ప్రభుత్వం మూడేళ్లలో పెట్టిన మూడు లక్షల కోట్ల బడ్జెట్ లో .. మూడున్నర లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తారు. దానికి కూడా.. రసీదులుండవు. అలా ఆరోపిస్తారు అంతే. కానీ అందులో లాజిక్ ఉంటుందా..? ప్రజలెవరైనా నమ్ముతారా..?. నమ్మరు.. ఇప్పుడు ఎందులోనైనా నిజంగా అవినీతి జరిగితే..దాన్ని జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా ప్రకటించినా.. ప్రజలు … మామూల ఆరోపణల్లో భాగమే అనుకుంటారు. కానీ సీరియస్ గా తీసుకోరు.
ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా..ఇలా ఆరోపణలు చేసుకంటూ వెళ్తున్నారు. రసీదులుండవు కాబట్టి తన దగ్గర ఆధారాలుండవంటున్నారు. కానీ ఎలాంటి ఆరోపణ చేసినా ఓ లాజిక్ ఉండాలి. ఆధారాలు లేకపోయినా ఇది నిజమే అని ప్రజలు కనీసం ఆలోచించగలిగేలా… ఆరోపణలు చేయాలి. అంతే కానీ.. వాళ్లు పాలకులు కాబట్టి.. వాళ్లపై అనే హక్కు ఉందనుకుంటే… ఎన్ని మాటలైనా అనవచ్చు. కానీ ఆ తిక్కకు లెక్క లేదని ప్రజలు అనుకునే పరిస్థితి వస్తుంది. అది మొత్తానికే ఇమేజ్ డ్యామేజ్ చేసి పెడుతుంది.
—సుభాష్