ఏపీ ఎన్నికలు, ఆ తరవాత మంత్రిగా బాధ్యతలతో పవన్ కల్యాణ్ సినిమాల ఊసుని పక్కన పెట్టేశారు. నిర్మాతలు కూడా పవన్ పై ఎలాంటి ఒత్తిడీ తీసుకురావడం లేదు. పవన్ కొన్నాళ్ల పాటు తన శాఖలకు సంబంధించిన పనుల్లోనే ఉండాలని, ప్రజలకు ఎంతో కొంత మంచి చేసిన తరవాతే సినిమాలపై దృష్టి పెట్టాలని భావించారు. అదే చేస్తున్నారు కూడా. ఇప్పుడు మెల్లగా సినిమాలపై దృష్టి పెట్టబోతున్నారు. అక్టోబరు నుంచి `ఓజీ`కి పవన్ డేట్లు ఇచ్చారని ఇన్ సైడ్ వర్గాల సమాచారం. ముందు ఆయన `ఓజీ` పూర్తి చేస్తారని అందుకే ‘ఓజీ’ కోసం బల్క్ గా కొన్ని డేట్లు ఇచ్చారని తెలుస్తోంది. ఇటీవలే నిర్మాత దానయ్య పవన్ కల్యాణ్ ని కలుసుకొన్నారని, ఈ సందర్భంగా `ఓజీ` పూర్తి చేయడానికి పవన్ తన సముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది.
Also Read : బాలకృష్ణ.. పవన్.. చెదిరిన ‘కథ’!
‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం కూడా ఈ యేడాది పవన్ కొన్ని డేట్లు ఇవ్వబోతున్నారు. అయితే.. పూర్తి ఫోకస్ మాత్రం 2025లోనే. ముందు ‘ఓజీ’ పూర్తి చేసి, `ఉస్తాద్`ని మొదలెడతారు. దానికి తగ్గట్టుగానే హరీష్ తన తదుపరి సినిమాల ప్లానింగ్ చేసుకొంటున్నారు. ‘హరి హర వీరమల్లు’ కూడా పవన్ పూర్తి చేయాల్సివుంది. అయితే `ఓజీ`తో పాటు ‘వీరమల్లు’ పూర్తి చేస్తారా, లేదంటే ‘ఓజీ’ అయ్యాకే దానిపై దృష్టి పెడతారా? అనేది తెలియాల్సివుంది. ఓజీ మొదలెట్టే ముందు పవన్ సినిమా కోసం శారీరకంగా కొంత సిద్ధం అవ్వాల్సి ఉంటుgది. అందుకే సెప్టెంబరు నుంచే ఆయన మళ్లీ కసరత్తులు మొదలెట్టే అవకాశాలు ఉన్నాయి.