కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ని ప్రైవేటీకరించడానికి సిద్దపడుతున్న కేంద్రం పై విమర్శలు సంధించాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీన్ని తాను, తన పార్టీ వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించాడు. అలాగే లాభాల్లో నడుస్తున్న సంస్థని ఎలా ప్రైవేటుపరం చేస్తారని ప్రశ్నించాడు.
కేంద్ర ప్రభుత్వం లో ప్రస్తుతం మినీరత్న హోదా కలిగిన కంపెనీ గా ఉంది ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సముద్రం లోపల తవ్వకాలు జరిపి అందులోని అవక్షేపాలని వెలికితీయడం ద్వారా వాటర్ వేస్ ని బోట్లు, పడవల నావిగేషన్ కి అనుకూలంగా ఉంచడం, అలాగే తవ్వకాలు జరిపి అవక్షేపాలని తొలగించి మత్స్యసంపద పెరగడానికి అనువైన పరిస్థితులు సముద్రం లో లేదా నదుల్లో ఏర్పాటు చేయడం వంటి విధులు ఈ సంస్థ నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ ఉద్యోగులు విశాఖపట్నం నుంచి వచ్చి పవన్ ని కలిసి సమస్య ని తెలియజేయడం తో కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ పవన్ కళ్యాణ్ గళం విప్పాడు. ఒక రకంగా ఎన్ డిఎ ప్రభుత్వం తో కయ్యానికి మళ్ళీ ఈ సమస్య ద్వారా కాలు దువ్వాడు.
అయితే ఇదే సమస్య విషయం లో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చురకలంటించాడు పవన్. తమిళనాడు లో ఇలా కేంద్ర సంస్థలు మూసే ప్రయత్నం చేసినపుడు గానీ ఇలా వాటిని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు జరిగినపుడు గానీ తమిళనాడు ప్రభుత్వాలు గట్టిగా వ్యతిరేకించాయనీ, మరి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇదే సందర్భం లో ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి విషయాలని బిజెపి విస్మరిస్తున్న విషయాన్ని కూడా గుర్తుచేసి, బిజెపి ని తూర్పారబట్టాడు.
ఇక బిజెపి, టిడిపిలు ఈ సమస్య పై ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.