జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ ప్రభుత్వంపై మరోసారి ఆరోపణలకు దిగారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రజా పోరాట యాత్ర విజయనగరం జిల్లా భోగాపురంలో సాగుతోంది. నిన్నటి వరకూ, గడచిన నాలుగేళ్లుగా నవ్యాంధ్రలో సాగిన టీడీపీ పాలనను విమర్శిస్తే… ఈరోజు ఇంకాస్త వెనక్కి వెళ్లి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పాలనపై కూడా విమర్శలు చేయడం విశేషం. హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధి చెందిందంటే దానికి కారణం నాటి చంద్రబాబు ప్రయత్నమే అనేది నిర్వివాదాంశం. హైటెక్ సిటీ టీడీపీ హయాంలోనే వచ్చిన సంగతి తెలిసిందే. దీని నిర్మాణానికి సంబంధించి కొన్ని విషయాలను పవన్ చెప్పారు!
మాట్లాడితే హైటెక్ సిటీ కట్టానని ముఖ్యమంత్రి అంటుంటారనీ, దాన్ని ఎవ్వరూ కాదనడం లేదన్నారు పవన్. ఆ ప్రాంతంలో హైటెక్ సిటీ రాబోతోందని ముందుగా ప్రభుత్వానికి మాత్రమే తెలుస్తుందనీ, ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, ఆయన చుట్టుపక్కల ఉండేవారే కదా అన్నారు. హైటెక్ సిటీ రాబోతోందన్న విషయాన్ని ముందుగా ప్రకటించకుండా.. వారి అనుయాయులు, దగ్గరివారితో చుట్టుపక్కల ఉన్న భూములన్నింటినీ అతి తక్కువ ధరకు చంద్రబాబు కొనిపించేశారని ఆరోపించారు! అయినవారంతా భూములు కొనుక్కున్నాక.. అప్పుడు హైటెక్ సిటీ అనౌన్స్ చేశారన్నారు. దీంతో సగటు తెలంగాణ రైతు ఆవేదన చెందాడనీ, తమ దగ్గర రూ. నలభై, యాభై వేలకు భూములు తీసుకుని, వందల కోట్లకు అమ్ముకున్నారంటూ రగిలిపోయారని పవన్ చెప్పారు! అందుకే తెలంగాణ వాదం వచ్చిందనీ, అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చిందని పవన్ చెప్పడం విశేషం. ఇలాంటి తప్పులు చేయబట్టే తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి నెట్టివేయబడిందన్నారు. మళ్లీ పాత పద్దతిలోనే టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటే జనసేన ఉపేక్షించదన్నారు. భూములు ఉమ్మడి సొత్తు, తెలుగుదేశం పార్టీ నాయకుల సొత్తు కాదని అన్నారు. జనసేన పార్టీ లేకుంటే ఉద్దానం నుంచి ఉత్తరాంధ్ర వెనకబాటుతనం వరకూ జరుగుతున్న అన్యాయాలను నిలదీసేవారు లేరు ఈరోజున అని పవన్ ఆవేశంగా మాట్లాడారు.
హైటెక్ సిటీ నిర్మాణం వెనక అవకతవకలున్నట్టుగా పవన్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవే. ఎందుకంటే, అది నిర్మించి ఇన్నాళ్లు అవుతున్నా, ఆ తరువాత ఎన్ని ప్రభుత్వాలు మారినా, రాష్ట్రం విడిపోయినా కూడా ఆ అంశమై ఎవ్వరూ ఎలాంటి విమర్శలూ ఆరోపణలు చెయ్యలేదు. కానీ, ఇవాళ్ల పవన్ కల్యాణ్ కొత్తగా చంద్రబాబు అనుయాయులు, సన్నిహితులు హైటెక్ సిటీ ప్రాజెక్టు వల్ల చుట్టపక్కల భూములు కొని లబ్ధి పొందారంటారు! మరి, పవన్ ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలు ఏవైనా ఉన్నాయంటే… ప్రస్తుతానికైతే ఆయన చెప్పలేదు.