ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సిపి కి చుక్కలు చూపిస్తున్నారు. ఏ మీడియా ఛానల్ చూపించక పోయినప్పటికీ, పత్రికలు ప్రచురించక పోయినప్పటికీ, పార్టీ జన సమీకరణ చేయకపోయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలోనూ వేలాదిగా ప్రజలు పవన్ కళ్యాణ్ సభలకు హాజరు అవుతున్నారు. హాజరవడమే కాకుండా పవన్ కళ్యాణ్ ఏం చెబుతాడా అని ఆసక్తికరం గా వింటున్నారు. ఈరోజు విజయవాడ తదితర ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్, వైఎస్సార్సీపీని తీవ్ర ఇరకాటంలో పడేసే విధంగా సూటి ప్రశ్నలు సంధించారు.
వివేకానంద రెడ్డి హత్య విషయాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీ నేత జగన్ పై కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. వైయస్ వివేకానంద రెడ్డి చనిపోయాక మొదటి అర పూట వైయస్ జగన్ తో సహా వైఎస్ఆర్ సీపీ నేతలు అందరూ అది సహజ మరణం అని, గుండెపోటు కారణం అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వివేకానంద రెడ్డి ది హత్య అంటూ, టిడిపి నేతలు హత్య చేయించారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ ని వైఎస్ఆర్సిపిని కేంద్రంగా చేసుకొని కొన్ని సూటి ప్రశ్నలు వేశారు.
వివేకానంద మరణం తర్వాత జగన్ ప్రవర్తించిన తీరు పై పవన్ ప్రశ్నలివే:
- పులివెందుల కానీ కడప కానీ మీ కోట అంటూ ఉంటారు కదా, మిమ్మల్ని కాదని అక్కడ ఎవరూ ఏమీ చేయలేరు అంటూ ఉంటారు కదా, మరి మీ కోట లో మీ బాబాయి గారి ని హత్య చేయడమే కాకుండా రక్తపు మరకలను, ఫింగర్ ప్రింట్స్ ని తుడిచేస్తే మీరు ఏమి చేయగలిగారు. మీ కోట అని చెప్పుకునే చోట బాబాయి ని రక్షించుకోలేని మీరు రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారు
- ఈ హత్యతో మీకు ప్రమేయం ఉందని నేను అనడం లేదు. కానీ చూసిన వెంటనే హత్య అని అర్థం అయిపోయే ఈ సంఘటనని ముందు సహజ మరణం అని, గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది. అదే మీరు మళ్లీ సాయంత్రాని కల్లా గొడ్డలితో నరికి చంపారు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది.
- మీ కోట అని చెప్పుకునే చోట మీ బాబాయిని హత్య చేసిన తర్వాత, రక్తపు మరకలు ఫింగర్ ప్రింట్స్ ఎవరు తుడిచి వేశారో నిజంగానే మీకు తెలియదా?
ఇవీ పవన్ కళ్యాణ్, వివేకానంద రెడ్డి హత్య సందర్భంగా జగన్ ప్రవర్తించిన తీరుని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు.
మొత్తం మీద:
నిజానికి వివేకానంద రెడ్డి హత్య విషయంలో, ఉదయాన్నే అది హత్య అని చెప్పి ఉంటే అసలు ఈ గందరగోళం అంతా ఉండి ఉండేది కాదు. కానీ ఏవో కారణాల వల్ల ముందు అది సహజం మరణం అని చెప్పి తర్వాత పోలీసుల ప్రవేశం తర్వాత హత్య గా చెప్పడం వల్లే ఈ గందరగోళం ఏర్పడింది. జగన్ కి నేరుగా ప్రమేయం ఉందని ఎవరు అనుకోరు కానీ, వివరాలు తెలిసి కూడా అధికార పార్టీ మీద అ నెపాన్ని వేయడానికి , తద్వారా రాజకీయ లబ్ధి కి జగన్ ప్రయత్నించడం వల్ల ఇప్పుడు జగన్ ఇరకాటంలో పడాల్సి వస్తోంది. ఇప్పటికే విచారణ చాలా వేగం గా జరుగుతోంది. కొద్ది రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన పూర్తి నిజాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
మరి ప్రత్యేక విచారణ బృందం ( సిట్ ) నివేదిక వచ్చాక పరిస్థితులు ఎలా మారతాయో అన్న ఆందోళన ఆంధ్ర ప్రాంతంలోని వైయస్సార్సీపి నేతల్లో కనిపిస్తోంది. ప్రత్యేక హోదా , రైల్వేజోన్ లాంటి అంశాలన్నీ పక్కకు వెళ్లి పోయి, వివేకానంద రెడ్డి హత్య ఎన్నికల అంశం అయిపోతుందని ఎవరూ ఊహించలేదు. మరి వివేకానంద హత్య సంఘటనలో నిజా నిజాలు బయటికి వచ్చాక రాజకీయ పరిణామాలు ఏ రీతిలో మారతాయి అన్నది వేచి చూడాల్సి ఉంది