రాయలసీమ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ రైల్వేకోడూరు లో పర్యటించారు. అక్కడ బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, రైల్వే కోడూరు జనసేన దే కావాలని ప్రకటించారు. రైల్వేకోడూరు ప్రాంతం తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
తన మొదటి సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదని, దాంతో చాలాకాలంపాటు ఖాళీగా ఉన్నాను అని , కానీ అప్పుడే రైల్వేకోడూరు నుంచి వచ్చిన ఒక నిర్మాత తనకు లక్ష రూపాయల చెక్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. సభకు వచ్చిన వారందరికీ ఆయనను పరిచయం చేసిన పవన్ కళ్యాణ్ ఆ రోజు ఆయన ఆ విధంగా ముందుకు రావడం వల్ల ఈరోజు తాను ఈ స్థానంలో ఉన్నా అని వ్యాఖ్యానించారు.
రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కాదని వెనక్కు నెట్టివేయబడ్డ ప్రాంతం అని మరొకసారి వ్యాఖ్యానించాడు పవన్ కళ్యాణ్. గత రెండు సభల్లో కూడా పవన్ కళ్యాణ్ ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే రెడ్డి అనే పదానికి అర్థం రక్షించేవాడు అని, ప్రజాధనాన్ని దోచుకునేవాడు కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. అయితే రైల్వేకోడూరులో అసంఖ్యాకంగా వచ్చిన జనాన్ని చూసి పవన్ కళ్యాణ్ ఉత్సాహ భరితంగా ప్రసంగించారు. రైల్వే కోడూరు జనసేన ది కావాలని పవన్ ఆకాంక్షించారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో రాజంపేట మరియు రైల్వేకోడూరులో జనసేన కు అవకాశాలు బాగానే ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆసక్తి కలిగించాయి.
ఏదేమైనా పవన్ కళ్యాణ్ ప్రసంగాలు, ఆశయాలు ఎంతవరకు ఎన్నికల లో ఓట్లు రాలుస్తాయి అన్నది ఎన్నికలయ్యాకే తెలుస్తుంది.