‘సరిపోదా శనివారం’లో ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ గురించి సూర్య ఎక్కడికి వెళ్లినా ‘ఖుషి 2’ గురించే అడుగుతున్నారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ ‘ఖుషి 2’ గురించిన ప్రస్తావన వచ్చింది. ‘ఖుషి 2′ ఎప్పుడు చేస్తారు?’ అంటూ కథానాయిక ప్రియాంక నేరుగా సూర్యనే అడిగింది. ఆ వేదికపై సూర్య సమాధానం చెప్పలేదు. అయితే టీమ్ ఇంటర్వ్యూలో మాత్రం ‘ఖుషి 2’ గురించిన కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు సూర్య.
”ఖుషి 2 అని పేరు పెట్టలేదు కానీ, అలాంటి ఓ కథ పవన్ గారికి చెప్పాను. అది ఆయనకు బాగా నచ్చింది. ఎంజాయ్ చేశారు. కానీ.. ‘ఇప్పుడు లవ్ స్టోరీలు ఎందుకులే. నేను వేరే జోన్లో ఉన్నాను’ అని సున్నితంగా తిరస్కరించారు. తమిళంలో ఎంజేఆర్ రాజకీయాల్లోకి వచ్చాక కూడా లవ్ స్టోరీలు చేశారు. మీరు చేయడంలో తప్పు లేదు. అని ఒప్పించడానికి ప్రయత్నించా. కానీ ఆయన ‘నో’ అనేశారు” అని చెప్పుకొచ్చాడు సూర్య. పవన్ ఆలోచన కూడా నిజమే. పవన్ వయసు పెరిగింది. ఇమేజ్ పూర్తిగా మారింది. ఈ వయసులో, ఇలాంటి పరిస్థితుల్లో లవ్ స్టోరీలు చేయడం కష్టమే. అందుకే ఆ ప్రాజెక్ట్ కథ దగ్గరే ఆగిపోయింది. అయితే వపన్ ఫ్యాన్స్ మాత్రం ‘ఖుషి 2’ని అకీరాతో తీస్తే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు. అకీరా త్వరలోనే సినిమాల్లోకి రానున్నాడని ప్రచారం సాగుతోంది. ఒకవేళ ‘ఖుషి 2’ అకీరాతో తీస్తే.. అంత కంటే గ్రాండ్ ఎంట్రీ మరోటి ఉండదు.