జనసేన కేంద్రంగా..కర్నూలులో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నీ ఒక దానికి ఒకటి సంబంధం లేనివిగానే ఉంటాయి కానీ.. ఏదో సంబంధం ఉందని.. అనుమానించక తప్పని పరిస్థితి. పవన్ కల్యాణ్ అలా కర్నూలు పర్యటనకు వెళ్లగానే.. ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ కూడా.. అదే జిల్లాకు వచ్చేశారు. అయితే.. ఆమె పవన్ కోసం రాలేదు. కాకపోతే.. రాజకీయాలకు సంబంధం ఉన్న సాక్షి టీవీ ప్రోగ్రాం కోసం యాంకరింగ్ చేయడానికి వచ్చారు. ఎప్పుడూ లేనిది… రేణుదేశాయ్ ఇలా ఎందుకు.. అని అనుకునేలోపే… గవర్నర్ నరసింహన్ కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలంకు వచ్చి… అక్కడ రాత్రి బస చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడ గవర్నర్ ఉన్నారని.. తెలిసిందో.. ముందుగానే… కబురు అందిందో కానీ.. పవన్ కల్యాణ్.. ఆళ్లగడ్డ పర్యటనను రద్దు చేసుకుని… అహోబిలం వైపు వేగంగా వెళ్లిపోయారు. ఓ పావుగంట సేపు.. గవర్నర్‌తో చర్చలు జరిపారు.
గవర్నర్‌తో అంత అత్యవసరంగా.. పవన్ కల్యాణ్ భేటీ కావాల్సిన అవసరం ఏమిటన్న చర్చ .. ఇప్పుడు రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది. కొద్ది రోజుల కిందట.. ఎట్‌హోం అనే గౌరవ కార్యక్రమంలో .. గవర్నర్, కేసీఆర్, పవన్ కూడా కలిశారు. కానీ.. రాజకీయ పరిస్థితులు మారిపోతున్న సమయంలో.. కర్నూలు జిల్లాకు గవర్నర్ రావడం.. అక్కడే ఉన్న పవన్ వెళ్లి కలవడం.. కచ్చితంగా రాజకీయ ఎజెండాతోనేని.. టీడీపీ, వైసీపీ నేతలు అనుకోవడం వింతేమీ కాకపోవచ్చు. అది రాజకీయ ఎజెండా ఏమిటన్నది… రాజకీయ పార్టీలకే కాదు.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి కూడా సస్పెన్స్‌గా మారింది.
గవర్నర్ బీజేపీ ఏజెంట్ అని టీడీపీ నేతలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. అంతే కాక.. ఆయన కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులనేది బహిరంగ రహస్యం. గతంలో పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేవారు. కానీ… ఓ సారి రాజ్‌భవన్‌లో విందు కార్యక్రమానికి హాజరై.. ఆ తర్వాత.. ప్రగతి భవన్లో… కేసీఆర్‌తో కలిసి లంచ్ చేసిన తర్వాత పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలను మార్చుకున్నారు. చంద్రబాబును, టీడీపీని టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు.. అందర్నీ కలిపే మరో ప్రయత్నం ఏమైనా గవర్నర్ ద్వారా జరుగుతోందా.. అన్న చర్చ … గట్టిగానే ప్రారంభమయింది. ముందు ముందు జరిగే రాజకీయ. పరిణామాలు దీనికి సమాధానం చెప్పువచ్చు.