వాలంటీర్లు మహిళల సమాచారం తెలుసుకుని అసాంఘిక శక్తులకు చేరవేస్తున్నారని దాని వల్ల పధ్నాలుగు వేల మంది మహిళలు గత నాలుగేళ్లలో అదృశ్యమయ్యారని పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు సంచలనాత్మకం అయ్యాయి. నిజంగానే ఇన్ని వేల మంది మహిళలు అదృశ్యమయ్యారా లేదా అన్నది ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. తనకు కేంద్ర నిఘా వర్గాలే చెప్పాయని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. ఈ వ్యవహారం సున్నితమైనది కావడంతో.. ప్రభుత్వం సైలెంట్ గా ఉంది. దీన్ని రాజకీయ పరమైన వివాదం చేస్తే తప్ప.. మరింత విస్తృతమైన చర్చ జరగకుండా అడ్డుకోలేమని అంచనాకు వచ్చారు.
అందుకే మొదట వాలంటీర్ల పేరుతో వైసీపీ కార్యకర్తలను రంగంలోకి దింపారు. పలు చోట్ల పవన్ కల్యాణ్ ఆరోపణలలు వచ్చిన పత్రికా కాపీలను తగులబెట్టారు. మరో వైపు మంత్రులు ఉలిక్కి పడ్డారు. పవన్ పై ఎప్పటిలాగే వ్యక్తిగత విమర్శలు పెంచారు. మరో వైపు మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ రంగంలోకి దిగారు. మహిళలు అదృశ్యమయ్ారని ఆరోపణలు చేసినందుకు నోటీసులు ఇచ్చారు. అసలు ఈ విషయంలో మహిళా కమిషన్ కు సంబంధం ఏమిటో ఎవరికీ అంతు చిక్కదు. అందులో నిజం లేకపోతే.. గత నాలుగేళ్లలో పధ్నాలుగు వేల మంది మహిళలు అదృశ్యం కాలేదని రికార్డులు బయట పెడితే.. పవన్ కు సమాధానం ఇచ్చినట్లవుతుంది.
మొత్తంగా ఏపీలో ప్రతి యాభై ఇళ్లకు ఉన్న ఓ వాలంటీర్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. వారి డేటా అంతా వారి దగ్గర ఉంటుంది. ఏ ఆధారం లేని మహిళలు ఇలా నిజంగానే మాయమైతే మాత్రం ఖచ్చితంగా వారిని.. వారివెనుక ఉన్న ముఠాలను అనుమానించాల్సిందే. అందుకే ఈ అంశంపై రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వీటిలోని నిజాలను రాష్ట్రం కాకపోతే.. కేంద్రం బయట పెట్టాల్సి ఉంది.