పిచ్చి ముదిరింది. రోకలి తలకు చుట్టమన్నట్లుగా రాజకీయాలు చేస్తే … చివరికి జనసేన అవుతుందన్నట్లుగా పరిస్థితి మారుతోంది. దీనికి కారణం నాయకుడి వ్యవహారిశైలే. బిజీగా సినిమాలు చేస్తూ.. ఆవిర్భావ దినోత్సవానికో… మరో పండుగకో వచ్చి చేసే ప్రసంగాల్లో ఆయన కులాన్నే దట్టిస్తున్నారు. కులం గురించి తనకు పట్టింపు లేదని.. అసలు కుల రహిత సమాజం కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించుకుంటూ ఉంటారు. కానీ ఆయనకు కులం పేరు ఎత్తనిదే స్పీచ్ సాగదు. ఇటీవలి కాలంలో అన్నీ కుల పరమైన వ్యాఖ్యలే చేస్తున్నారు. దీని వల్ల జనసేనకు ఎంత లాభం వస్తుంది.
కాపులు ఓట్లేయకపోవడం వల్లనే ఓడిపోలేదని ముందు పవన్ గుర్తించాలి !
పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోయా.. ఓడిపోయా అంటారు. అక్కడ ఆయనను ఓడించడం ద్వారా అక్కడి ప్రజలు చేసింది కరెక్టేనని పవన్ కల్యాణ్ నిరూపించారు. తన కులం వారు ఓట్లేయలేదని ఆయన నిష్ఠూరమాడుతున్నారు. కానీ ఏ కులం కూడా కావాలని కట్టకట్టుకుని ఓ పార్టీకి ఓటు వేయలేదు. టీడీపీ ఓ వర్గం మద్దతు ఉంటుంది… కానీ వంద శాతం ఆ పార్టీకి వేస్తారు. వేసినా ఆ వర్గం జనాభా ఎంత ? అలాగే వైసీపీకి కూడా. రెడ్డి వర్గం ఎక్కువ మద్దతు ఇస్తుంది. కానీ వంద శాతం ఇస్తుందా ? రెడ్డి వర్గం అతి తక్కువగా ఉండే ఉత్తరాంధ్ర నుంచి కోస్తా వరకూ వైసీపీకి ఓట్లేసిందెవరు ?. తన కులం వారు ఓట్లేయలేదని ఓడిపోయానని చెప్పుకుంటే అంత కంటే అవగాహనా రాహిత్యం ఉండదు. రాజకీయాల్లో ఇది చైల్డిష్ అనుకుంటారు. తన ఓటమికి తన కులంపై నెపం వేయడం అమాయక రాజకీయం.
అందరూ సంఘటితమవ్వాలంటే వారికి నమ్మకం కలిగించాలి !
కమ్మ వాళ్లంతా టీడీపీకి మద్దతివ్వరు. కానీ మెజార్టీ ఇస్తారు. ఎందుకంటే… వారికి ఆ పార్టీ నాయకత్వంపై నమ్మకం కలిగించడమే కాదు.. మరో పార్టీ… తమకు ప్రత్యర్థులు మరో వర్గం అన్నట్లుగా చిత్రీకరించింది. వైసీపీకి రెడ్డి వర్గం మెజార్టీ మద్దతిస్తారు . వందకు వంద శాతం ఇవ్వరు. ఆ వర్గం జగన్ రెడ్డి నాయకత్వం పట్ల నమ్మకం పెంచుకుంది. కానీ కాపులంతా ఎందుకు అప్పట్లో చిరంజీవి నాయకత్వాన్ని.. ఇప్పుడు పవన్ నాయకత్వాన్ని నమ్మలేకపోయారు… ? ముందు పవన్ కల్యాణ్ ఈ విషయంపై అత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు నమ్మలేకపోతున్నారు… తమ వర్గం అనుకున్నవారు ఎందుకు సపోర్టుగా ఉండటం లేదు… పవనన్నకు ప్రేమిస్తాం.. జగనన్నకు ఓటు వేస్తామని ఎందుకంటున్నారో ఆలోచించుకోవాలి. వారిలో మార్పు తెచ్చుకోవాలి. ఇలా చేయాలంటే.. పవన్ తనపై నమ్మకం పెంచుకోవాలి. అలాంటి ప్రయత్నం చేశారా ?
కాపుల్లో నమ్మకం కలిగించడానికి పవన్ చేసిందేంటి?
తాను మాత్రమే కాపులకు మేలు చేస్తానని పవన్ కల్యాణ్ ఘనంగా ప్రకటించుకున్నారు. ఇప్పటి వరకు ఏం మేలు చేశారో చెప్పాలని వైసీపీ కాపు నేతలు ప్రశ్నించారు. అధికారంలో లేము కాబట్టి ఏమీ చేయలేదని జనసేన వాదించవచ్చు.. కానీ ఏమైనా చేస్తామని నమ్మకం అయినా కలిగించాలి కదా. కనీసం ప్రజల్లో ఉన్నారా అంటే అదీ లేదు. రెండుచోట్ల ఓడిపోయిన తర్వాత వాటి వైపు చూడలేదు. తనకు పార్టీ నడపాలంటే సినిమాలు చేయాల్సిందేనని పవన్ వాదించవచ్చు. కానీ ప్రజలు దీన్ని పట్టించుకోరు. వారికి అందుబాటులో ఉండాలి. రాజకీయంగా సుదీర్ఘ కాలం పని చేయాలంటే ప్రజల్లో ఉండాలి. కానీ అలాంటి పనే చేయకుండా… నా వెంటే నడవండి అంటే కాపులు ఎలా నడుస్తారు.
మొత్తంగా పవన్ తన వర్గం అంటూ చెప్పుకున్న వర్గం మొత్తం ఆయన వెనుక ఉండకపోవడానికి కారణం పవనే. వారిలో నమ్మకం కలిగించలేకపోవడమే.