రాయలసీమలో ప్రత్యేక రాష్ట్ర వాదం.. ఉత్తరాంధ్రలో ప్రత్యేక ఉత్తరాంధ్ర వాదం వినిపిస్తున్న వైసీపీ నాయకులకు పవన్ కల్యాణ్ తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని హెచ్చరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. మరోసారి తనదైన శైలిలో పవర్ చూపించారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో విసిగిపోయామన్నారు. మీ బతుకులకేం తెలుసు? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ చదివారా? అవినీతిలో మునిగిపోయిన.. పబ్లిక్ పాలసీ తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా? మేం చూస్తూ కూర్చొంటామా? అని మండిపడ్డారు. మేం దేశ భక్తులం.. ఆంధ్రప్రదేశ్‌ను ఇంకోసారి విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని, ప్రజల్ని విడగొట్టింది చాలు.. ఇక ఆపేయండని స్పష్టం చేశారు.
సీఎం జగన్ తీరుపై పవన్ తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ టీనేజ్ లో ఉన్నప్పుడు కడపలోని పులివెందులలో ఓ ఎస్సైని జైల్లో పెట్టి కొట్టారని ఆరోపించారు. అటువంటి వ్యక్తి చేతుల్లో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ జగన్ చేతుల్లో ఉందన్నారు. ‘అవసరానికి నీ ఎజెండా మార్చేస్తావు అని మాట్లాడుతున్నారు. ప్రజల అవసరాల కోసం నేను మారతా.. నా విధానాలు మార్చుకుంటా. అన్ని కులాలను అనుసంధానం చేసే నాయకత్వం అవసరం. మార్కిస్ట్, కమ్యూనిస్టు కాదు.. నేను హ్యూమనిస్టు. ఎప్పుడూ కొన్ని కులాలకే అధికారమా? ఇది సమంజసమా? అని ప్రశ్నించారు.