అనంతపురం జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటనకు అనూహ్య స్పందన వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించేందుకు పవన్ పర్యటించారు. నేరుగా మృతుల కుటుంబాలు నివాసం ఉండే ఇంటికి వెళ్లడం.. అక్కడ వారిని పరామర్శించడం.. ఆర్థిక సాయం అందించడంతో పాటు అండగా ఉంటానని భరోసా ఇచ్చేందుకు.. తన ప్రతినిధుల ఫోన్ నెంబర్లు ఇవ్వడం వంటివిచేశారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలి రాగా ఈ టూర్ సాగింది.
పవన్ కల్యాణ్ రైతు భరోసా యాత్రను చూసిన వారందరికీ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన ఓదార్పు యాత్రే గుర్తుకు వస్తోంది. అచ్చంగా అంతే అట్టహాసంగా వెళ్లడం.. బాధితుల ఇంట్లో కింద కూర్చుని వారి యోగక్షేమాలు తెలుసుకోవడం వంటివన్నీ చేస్తున్నారు. జనసేన తరపున మీడియా కవరేజీ కూడా అదే రేంజ్లో ఉంది. జగన్ను ఓదార్పు యాత్రకు మంచి స్పందన వచ్చింది. ఆయన ఇమేజ్ పెరిగింది. అయితే ఆయన చేసిన ఓదార్పు యాత్ర.. తన తండ్రి కోసం మరణించారని చెప్పుకున్న వారి కోసం. కానీ పవన్ కల్యాణ్ మాత్రం రైతుల కోసం ఓదార్పు యాత్ర చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో చివరికిగా పరామర్శ చేసే గ్రామంలో గ్రామ సభను కూడా పవన్ కల్యాణ్ నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై విరుచుకుపడే అవకాశం ఉంది. ముందు ముందు మరిన్ని జిల్లాల్లో పవన్ కల్యాణ్ రైతు ఓదార్పు యాత్రలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.